Telugudesam: ఏమౌతుంది మీవల్ల? ఒకవేళ కొడితే రెండు కొడతారు.. అంతేకదా?: వైసీపీ నేతలపై చంద్రబాబు ఫైర్

  • వైసీపీ నేతలు గూండాల మాదిరి ప్రవర్తించారు
  • గ్యాలరీలో కూర్చున్న నాపై ఎన్ని మాట్లాడారు?
  • షరీఫ్ పై తణుకు ఎమ్మెల్యే మాటలు వినలేము!

శాసనమండలి గ్యాలరీకి వెళ్లే సమయంలో తమ వద్ద ఉన్న సెల్ ఫోన్లను తీసేయమంటే పక్కన పెట్టేశామని, తమ తర్వాత లోపలకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు సెల్ఫీలు దిగారని చెబుతూ, ఇటీవల మండలిలో జరిగిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు చేశారు. మంగళగిరిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మా దగ్గర సెల్ ఫోన్స్ ఉండకూడదా? వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం సెల్ఫీలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు.

కింద నుంచి బాటిల్స్ పైకి విసిరేయడం, గ్యాలరీ లో నుంచి కిందకు చింపిన కాగితపు ముక్కలు వేయడం దారుణమని, గూండాల్లా, బజారు రౌడీల్లా, అరాచకశక్తుల మాదిరి ప్రవర్తించారని వైసీపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. 'గ్యాలరీలో కూర్చున్న నాపై ఎన్ని మాటలు మాట్లాడారు? నా మానసిక స్థైర్యాన్ని పరీక్షిస్తారా? ఏమౌతుంది మీవల్ల? ఏం చేయగల్గుతారు? ఒకవేళ కొడితే రెండు కొడతారు, అంతేకదా?’ అంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. మండలి చైర్మన్ షరీఫ్ పై తణుకు ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు వినలేని విధంగా ఉన్నాయని, బజారు రౌడీల కంటే ‘వరస్ట్ గా బిహేవ్ చేశారు’ అని చంద్రబాబు మండిపడ్డారు.

షరీఫ్ చేసిన తప్పేంటి? ధర్మాన్ని, చట్టాన్ని కాపాడటం ఆయన చేసిన తప్పా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కౌన్సిల్ ను వైసీపీ నేతలే నడపాలని చూశారని, షరీప్ ఆదేశించినా కూడా లైవ్ ప్రసారాలు ఇవ్వలేదని ఆరోపించారు. ‘మీరు ఏమన్నా ఉన్మాదులా? దున్నపోతులా? మీకు చెబితే అర్థం కాదా?’ అంటూ మండలిలోకి వెళ్లిన వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు.

ఈ ముఖ్యమంత్రిని ఎలా అర్థం చేసుకోవాలో!

ఆర్టికల్ 169 తప్ప ఎప్పుడూ మండలి గురించిన చర్చ అసెంబ్లీలో జరగకూడదని, అలాంటిది, నిన్న శాసనసభలో సీఎం జగన్ ఈ అంశం గురించి మాట్లాడారని చంద్రబాబు విమర్శించారు. అసెంబ్లీ గానీ, మండలి గానీ స్వయం ప్రతిపత్తి గలవి అని, ఆ విషయాన్ని పట్టించుకోకుండా షరీఫ్ ప్రసంగాన్ని అనుమతి లేకుండా ప్రదర్శించడం, వక్రీకరించి మాట్లాడటం చేశారని విమర్శించారు. నిబంధనలు ఉల్లంఘించే శాసనమండలిని కొనసాగించాలా? అని నిన్న సీఎం జగన్ ప్రశ్నించారని.. 'మరి ఈ ముఖ్యమంత్రిని ఎలా అర్థం చేసుకోవాలో!' అంటూ నిట్టూర్పు విడిచారు.

More Telugu News