మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ పై చీటింగ్ కేసు!

23-01-2020 Thu 12:17
  • తనను మోసం చేశారంటున్న ఔరంగాబాద్ కు చెందిన ట్రావెల్ ఏజెంట్ 
  • విమాన టికెట్లు బుక్ చేయించి డబ్బు చెల్లించలేదని ఫిర్యాదు 
  • తానెవరినీ మోసం చేయలేదంటున్న మాజీ కెప్టెన్

టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ అజహరుద్దీన్ తోపాటు మరో ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదైంది. పెద్దమొత్తంలో విమాన టికెట్లు తనతో బుక్ చేయించి వాటి డబ్బు చెల్లించలేదంటూ ఔరంగాబాద్ కు చెందిన షాహెబ్ మొహమ్మద్ అనే ట్రావెల్ ఏజెంటు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

అయితే తానెవరినీ ఎటువంటి మోసం చేయలేదని ట్విట్టర్ వేదికగా అజహర్ స్పష్టం చేశాడు. ఫిర్యాదులోని అంశాల ప్రకారం...గత ఏడాది నవంబరు 9 నుంచి 12 మధ్య సుధీష్ అవిక్కల్ అనే వ్యక్తి షాహెబ్ ద్వారా దుబాయ్-పారిస్, పారిస్-ట్యూరిన్, ట్యూరిన్-పారిస్, ట్యూరిన్-ఆమ్ స్టర్ డాం, ట్యూరిన్-మునిచ్-ఆమ్ స్టర్ డాంలకు విమాన టికెట్లు బుక్ చేయించాడు.

ఈ టికెట్లపై సుధీష్ తోపాటు అజహరుద్దీన్ ప్రయాణించారు. 'టికెట్లు బుక్ చేయమన్నప్పుడు అత్యవసరంగా ప్రయాణం ఉందని, ప్రస్తుతానికి డబ్బు తనవద్ద లేదని, టికెట్ల డబ్బు తర్వాత ఇస్తానని సుధీష్ ఆ సమయంలో చెప్పాడు. ఆ డబ్బుకు తాము హామీ అని అజహర్ వ్యక్తిగత సిబ్బంది మజీబ్ ఖాన్ తెలిపారు. దీంతో నేను రూ.20 లక్షలు ఖర్చుచేసి టికెట్లు బుక్ చేశాను' అని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

కానీ నవంబరు 12న డబ్బు చెల్లిస్తానన్న సుధీష్ చెల్లించలేదని, ఈ విషయాన్ని అజహరుద్దీన్, మజీబ్ ఖాన్ల వద్ద ప్రస్తావించినా వారు కూడా పట్టించుకోలేదని బాధితుడు చెబుతున్నాడు. పలుమార్లు సంప్రదించగా ఎట్టకేలకు నవంబరు 24న సుధీష్ తన ట్రావెల్ ఏజెన్సీ పేరుతో 21 లక్షల 45 వేలు చెల్లిస్తున్న చెక్కు ఫొటోతీసి వాట్సాప్ లో పంపాడని, కానీ అసలు చెక్కు మాత్రం ఇప్పటి వరకు అందలేదని వాపోయాడు.

ఈ ఆరోపణలపై అజహరుద్దీన్ నిన్న ఓ వీడియో విడుదల చేస్తూ తానెవరినీ చీట్ చేయలేదని, దీన్ని న్యాయపరంగా ఎదుర్కొంటానని తెలిపారు.