Prattipati Pullarao: శాసన మండలిలో 3 రాజధానుల బిల్లుకు ఆమోదం జగన్ తరం కాదు: మాజీ మంత్రి ప్రత్తిపాటి సంచలన వ్యాఖ్యలు

  • 151 మంది ఎమ్మెల్యేలున్నా వేలాది మంది పోలీసులా?
  • రెండు కాన్వాయ్ లతో అసెంబ్లీకి జగన్
  • గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదన్న ప్రత్తిపాటి

అసెంబ్లీలో ఆమోదం పొందినంత మాత్రాన అమరావతి స్థానంలో మూడు రాజధానులు రాబోవని, ఈ బిల్లును శాసన మండలిలో ఆమోదింపజేసుకోవడం సీఎం వైఎస్ జగన్ తరం కాదని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. తాజాగా గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రం పరువు, ప్రతిష్ఠలను జగన్ జాతీయ స్థాయిలో మంటగలిపారని మండిపడ్డారు. 151 సీట్లు గెలుచుకున్న పార్టీ యుద్ధ వాతావరణాన్ని సృష్టించి, వేలాది మంది పోలీసులను మోహరించి, అసెంబ్లీ సమావేశాలు జరుపుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.

గతంలో ఏ ముఖ్యమంత్రీ రెండు కాన్వాయ్‌ లలో అసెంబ్లీకి వెళ్లిన పరిస్థితి లేదని, దీన్ని బట్టే, ప్రభుత్వంపై ఎంత ప్రజాగ్రహానికి గురైందో తెలుసుకోవచ్చని అన్నారు. ప్రస్తుతం ఏపీతో పోలిస్తే, జమ్మూ కశ్మీర్‌ లో పరిస్థితి బాగుందని ప్రత్తిపాటి అన్నారు. ప్రకాశం బ్యారేజి మీదుగా దుర్గమ్మ దర్శనానికి కూడా వెళ్లే అవకాశం లేని పరిస్థితులను ప్రభుత్వం కల్పించిందని మండిపడ్డారు.

ప్రజలకు ఇష్టంలేని బిల్లులను ఆమోదం చేయించుకునే ప్రయత్నంలో జగన్ ఉన్నారని, ఇది సాగనివ్వబోమని అన్నారు. బిల్లులు ఆమోదం పొందినా, వాటిని అమలు చేసే శక్తి ప్రభుత్వానికి లేదని, ప్రజలు వివాదాస్పద బిల్లులను అడ్డుకుని తీరుతారని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మందీ అమరావతే కావాలని కోరుకుంటున్నారని, మూడు రాజధానులు వద్దని వారు గట్టిగా నిర్ణయించుకున్నారని అన్నారు.

తెలుగుదేశం పార్టీపై, చంద్రబాబునాయుడిపై ఉన్న కక్షతోనే జగన్, తనదైన అజెండాను అమలు చేయాలని చూస్తున్నారని, కానీ రానున్న ప్రజా తిరుగుబాటును ఆయన అంచనా వేయలేకపోతున్నారని ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. జగన్ నిర్ణయాలను కోర్టులు కూడా అడ్డుకుని తీరుతాయని అంచనా వేశారు.

More Telugu News