Andhra Pradesh: మావోయిస్టు ప్రాబల్యం ఉన్న చత్తీస్ గఢ్ లో కూడా ఇంతమంది పోలీసులను మోహరించడంలేదు: దేవినేని ఉమ

  • ఏపీ పోలీసు రాజ్యంలా మారిపోయిందన్న ఉమ
  • వైసీపీ నేతలు సిగ్గుతో తలదించుకోవాలన్న టీడీపీ నేత
  • సీఎం అసలు మనిషేనా అని ప్రజలంటున్నారని వ్యాఖ్యలు

రేపటి నుంచి మూడ్రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. 151 సీట్లు గెలుచుకున్నామని చెప్పుకుంటున్న వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులారా సిగ్గుతో తలదించుకోండని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలు జరుపుకోవడానికి 10 వేల మంది పోలీసులను మోహరించారంటే అంతకంటే సిగ్గుపడాల్సిన విషయం మరొకటి లేదని అన్నారు. మావోయిస్టుల ప్రభావం ఉన్న చత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా పోలీసులను మోహరించడంలేదని విమర్శించారు.

"ప్రజాస్వామ్యంలో ఎందుకు భయపడుతున్నారు? చేసిన తప్పులకు, దుర్మార్గాలకు భయపడుతున్నారు. రెండుమూడు పంటలు పండే 34 వేల ఎకరాల భూములను రాష్ట్ర రాజధాని కోసం త్యాగం చేసిన రైతులు కంటతడి పెడుతుంటే ఈ కర్కోటకుడైన సీఎంకు కనీస మానవత్వం ఉందా, అసలు మనిషేనా? అని ప్రజలు అడుగుతున్నారు" అంటూ విమర్శలు గుప్పించారు.

విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో ప్రొఫెసర్ శ్రీనివాసరావు, అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో రాజధానిపై రిఫరెండం ప్రక్రియ నిర్వహిస్తుంటే షార్ట్ సర్క్యూట్ అయిందని అక్కడి నుంచి అందరినీ ఖాళీ చేయించి పోలీస్ పహారా ఏర్పాటు చేయించారని ఆరోపించారు. ఏపీని పోలీసు రాజ్యంగా మార్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ముచ్చటపడుతున్న విశాఖలోనే బ్యాలెట్ ప్రక్రియ నిర్వహిస్తుంటే ఎందుకు అడ్డుపడ్డారో చెప్పాలని నిలదీశారు.

More Telugu News