బాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన మహేశ్ బాబు

19-01-2020 Sun 14:49
  • 'సరిలేరు నీకెవ్వరు' విజయంతో మహేశ్ బాబు ఆనందం
  • ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సూపర్ స్టార్
  • తన మూలాలు టాలీవుడ్ లోనే ఉన్నాయని వెల్లడి

టాలీవుడ్ లో ఈ సంక్రాంతి సీజన్ కు విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన చిత్రాల్లో మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ఒకటి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మహేశ్ బాబు అభిమానులకు విందు భోజనంలా ఉందని విమర్శకులు సైతం ప్రశంసించారు. సరిలేరు నీకెవ్వరు ఘనవిజయం సాధించడంతో మహేశ్ బాబు ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

తన కెరీర్ లో ఎప్పటికీ హిందీ చిత్రసీమకు వెళ్లబోనని స్పష్టం చేశారు. ఒకసారి కాదు, వందసార్లు అడిగినా బాలీవుడ్ కు వెళ్లననే చెబుతానని, తెలుగు చిత్ర పరిశ్రమే తనకు సర్వస్వం అని వెల్లడించారు. తన మూలాలు ఉన్నది ఇక్కడేనని, ఇక్కడి ప్రజల ఆశీస్సులే తనకు బలం అని వివరించారు. ఒకవేళ తన సినిమాలు హిందీలోకి డబ్ అయి, రెండు చోట్ల ఏకకాలంలో విడుదలైతే తప్ప, ప్రత్యేకంగా హిందీలో సినిమాలు చేయనని తేల్చి చెప్పారు. పాన్ ఇండియన్ సినిమా అనే భావన కూడా సరికాదని, ఓ మంచి సినిమా మొదలుపెడితే భాష, ప్రాంతాలతో సంబంధం లేకుండా అది అన్ని ప్రాంతాలతో కనెక్ట్ అవుతుందని వివరించారు.