KL Rahul: కేఎల్ రాహుల్ కళాత్మక విధ్వంసం... ఆసీస్ కు భారీ టార్గెట్ ఇచ్చిన భారత్

  • రాజ్ కోట్ వన్డేలో భారత్ స్కోరు 340/6
  • 52 బంతుల్లో 80 పరుగులు చేసిన రాహుల్
  • రాణించిన ధావన్, కోహ్లీ

బలమైన ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ పుంజుకుంది. తొలి మ్యాచ్ లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలన్న కసితో రాజ్ కోట్ వన్డేలో అడుగుపెట్టిన భారత్ మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 340 పరుగులు చేసింది. యువ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ 52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 80 పరుగులు చేశాడు. రాహుల్ కళాత్మక ఆటతీరుతో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించడం హైలైట్ గా నిలిచింది.

అంతకుముందు ఓపెనర్ శిఖర్ ధావన్ 96 పరుగులతో మరోసారి తన మార్క్ చూపించాడు. ఎప్పట్లాగానే కెప్టెన్ కోహ్లీ యాంకర్ ఇన్నింగ్స్ తో భారత్ భారీ స్కోరుకు బాటలు వేశాడు. కోహ్లీ 76 బంతుల్లో 78 పరుగులు చేశాడు. ఓపెనర్ రోహిత్ శర్మ 42 పరుగులు చేయగా, చివర్లో రవీంద్ర జడేజా 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 3, కేన్ రిచర్డ్సన్ 2 వికెట్లు తీశారు.

More Telugu News