space technology: నింగిలో నిఘా నేత్రం.. తెలంగాణ పోలీసుల 'టెక్నాలజీ' మంత్రం

  • రిమోట్ సెన్సింగ్ సాయంతో ఆకాశం నుంచే నిఘా
  • ప్రమాదాలు, అసాంఘిక కార్యకలాపాలు, అఘాయిత్యాలపై దృష్టి 
  • ఆరు బయట మందుతాగినా పసిగట్టే సాంకేతిక పరిజ్ఞానం

అమ్మాయిలను ఏడిపించే తత్వం మీకుందా?... మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటారా?... రోడ్డుపై వేగంగా వాహనాన్ని నడుపుతూ పక్కవారిని భయాందోళనలకు గురిచేస్తున్నారా?...ఆరుబయట బహిరంగంగా మందుతాగినా మనల్ని అడిగేది ఎవరని విర్రవీగుతున్నారా?... అయితే ఇకపై మీ ఆటలు సాగవని హెచ్చరిస్తున్నారు తెలంగాణ పోలీసులు. 

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నేరాలు, ప్రమాదాలు, అసాంఘిక కార్యకలాపాల నివారణలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అడుగులు వేస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవడంలో ఇప్పటికే నెంబర్ వన్‌గా నిలిచిన ఇక్కడి పోలీసులు తాజాగా అంతరిక్ష పరిజ్ఞానాన్ని సొంతం చేసుకుని రిమోట్ సెన్సింగ్ సేవల సాయంతో తప్పుచేసే వారిని కట్టడి చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. 

అసాంఘిక కార్యకలాపాలు కానీ, ప్రమాదాలు కానీ ఏవి జరిగినా క్షణాల్లో డీజీపీ కార్యాలయానికి సమాచారం అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడి నుంచి సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం వెళ్లిన క్షణాల్లోనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుంటారు.

ఇందుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు డీజీపీ ఎం.మహేందర్‌ రెడ్డి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ జితేందర్, బెటాలియన్ల అడిషనల్ డీజీపీ అభిలాష బిస్త్ తో కలిసి నిన్న తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ (ట్రాక్) అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, సైంటిఫిక్ ఇంజనీర్లతో భేటీ అయ్యారు. నేరాల అదుపు, మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థతో ప్రమాదాల నివారణ తదితర అంశాలపై చర్చించారు. ఇందుకోసం ట్రాక్ తో త్వరలోనే ఎంఓయూ కుదుర్చుకోనున్నట్లు ప్రకటించారు.

More Telugu News