Hyderabad: ఉద్యోగం నుంచి తీసేశారన్న కోపంతో... ఆ కంపెనీని నిండా ముంచేసిన యువకుడు!

  • హైదరాబాద్ లో ఘటన
  • అవకతవకలకు పాల్పడటంతో ఉద్యోగం కోల్పోయిన వైనం
  • ముగ్గురితో కలిసి కొత్త కంపెనీ పెట్టి, పాత కంపెనీకి ద్రోహం
  • అరెస్ట్ చేసిన పోలీసులు

తనను ఉద్యోగం నుంచి తొలగించారన్న కోపంతో, ఓ యువకుడు, తన తెలివి తేటలను ఉపయోగించి, ఓ కంపెనీని నిండా ముంచేశాడు. మరో ముగ్గురితో చేతులు కలిపి, కంపెనీకి చెందిన సమస్య సమాచారాన్ని తస్కరించాడు. ఈ కేసులో ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి, కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే, ఓ ఫార్మా కంపెనీలో శ్రీకాంత్ రెడ్డి, కృష్ణా రెడ్డి, యోగేశ్వర్ రావు, వెంకటరెడ్డి ఉద్యోగులు. వీరంతా సంస్థలో ఉన్నతోద్యోగులుగా ఉంటూ, అధికమొత్తంలోనే వేతనాన్ని తీసుకుంటున్నారు. వీరిలో శ్రీకాంత్ రెడ్డి అవకతవకలకు పాల్పడి కంపెనీకి నష్టం కలిగించినట్టు తేలడంతో, 2017లో విధుల నుంచి తొలగించారు. ఆ కోపంతో సంస్థకు నష్టాన్ని కలిగించాలని భావించి, మిగతా ముగ్గురినీ తన ప్లాన్ లో కలుపుకున్నాడు.

శ్రీకాంత్ రెడ్డి జీడిమెట్ల హాబర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఓ కంపెనీని ప్రారంభించి, వారికి భారీ రెమ్యునరేషన్ ఇస్తానంటూ ఆశ చూపించాడు. తన వద్దకు రావాలంటే, వారి సంస్థలోని డేటాను సంగ్రహించాలని సూచించాడు. ఆపై వారు అందించే డేటాతో, కంపెనీ టెండర్ల కోట్ లతో తాను ఎదగడం ప్రారంభించాడు. ఫార్మా ఉత్పత్తులను తయారు చేసి, పాత కంపెనీ కస్టమర్లకు తక్కువ ధరకు సరఫరా చేయడం ప్రారంభించాడు.

దీన్ని గమనించిన పాత కంపెనీ యాజమాన్యం, తమ డేటా చోరీకి గురవుతోందని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు, ప్రొడక్షన్ కంట్రోల్ రికార్డుల నుంచి, విశ్లేషణలు, టెస్టింగ్ ప్రొసీజర్, ముడి సరుకుల డేటా తదితరాలు చోరీకి గురయ్యాయని తేల్చి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News