Telangana: టీఆర్ఎస్, బీజేపీ డూప్ ఫైటింగ్ చేస్తున్నాయి: పొన్నం

  • బీజేపీతో కుమ్మక్కయ్యామనడం హాస్యాస్పదం అన్న పొన్నం
  • బీజేపీతో ఎప్పటికీ కలవబోమని స్పష్టీకరణ
  • టీఆర్ఎస్, బీజేపీ చెలిమిపై ఆధారాలున్నాయని వెల్లడి

తెలంగాణలో పురపాలక ఎన్నికల నేపథ్యంలో పార్టీల మధ్య మాటలయుద్ధం ముదురుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ తాజాగా టీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. కరీంనగర్, నిజామాబాద్ లో బీజేపీతో కాంగ్రెస్ కుమ్మక్కయిందని ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. బీజేపీతో తామ ఎప్పటికీ కలవబోమని స్పష్టం చేశారు. నిజానికి టీఆర్ఎస్, బీజేపీ చెలిమి చేస్తున్నాయని, తమవద్ద అందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయని పొన్నం వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల తరుణంలో ఆ రెండు పార్టీలు ఉత్తుత్తి యుద్ధం చేస్తున్నాయని ఆరోపించారు.

తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని, ఈ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్ కు లేదని విమర్శించారు. కరీంనగర్ లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పొన్నం ఈ వ్యాఖ్యలు చేశారు. విపక్షాల నుంచి ఎవరైనా పోటీ చేసేందుకు ముందుకు వస్తే వారిపై ఒత్తిళ్లు తీసుకువచ్చి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేస్తున్నారని పొన్నం మండిపడ్డారు. విపక్షాల అభ్యర్థుల ఇళ్లలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వారిని బదిలీ చేస్తామని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News