Sankranti: ఈ ఒక్క పనీ చేసి, విజయం సాధిస్తే.. నేను కూడా ఒప్పుకుంటా!: జగన్ కు చంద్రబాబు సవాల్

  • ఎంతో బాధతో సంక్రాంతి జరుపుకుంటున్నా
  • రెఫరెండం పెట్టే దమ్ముందా?
  • తిరిగి గెలిస్తే అమరావతి వద్దని ఒప్పుకుంటా?
  • ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్

తాను ఏర్పాటు చేసిన అమరావతిని నవ్యాంధ్ర రాజధానిగా వద్దని అంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఆపై ఎన్నికలకు వెళ్లాలని, ఎన్నికల్లో వారు గెలిస్తే, తాను కూడా అమరావతి వద్దని ఒప్పుకుంటానని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. సీఎం జగన్, ఈ ఒక్క పని చేసి, విజయం సాధిస్తే, తాను రాజకీయాల నుంచి తప్పుకునేందుకు కూడా సిద్ధమేనని ఆయన సంచలన ప్రకటన చేశారు.

ఈ ఉదయం జరిగిన భోగి మంటల్లో జీఎన్ రావు, బీసీజీ ప్రతులను మంటల్లో తగలబెట్టిన చంద్రబాబు, అమరావతి ఘన చరిత్రను నాశనం చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా తమ భాషను, సంస్కృతిని మరచిపోబోరని, అమరావతి కేంద్రంగా వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ ఓ సువిశాల, సంపన్న రాజ్యం ఉందని అన్నారు. దాని చారిత్రక ప్రాధాన్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

తన మనసులో ఎంతో బాధ నిండివుందని, ఇంత బాధలో సంక్రాంతి పండగను జరుపుకోవాల్సి వస్తుందని ఎన్నడూ అనుకోలేదని చంద్రబాబు తెలిపారు. అంత బాధలోనూ వైసీపీ నేతలు కోడి పందాలు ఆడుతున్నారని, మూడు రాజధానులపై రెఫరెండం పెట్టి, ప్రజల నుంచి అభిప్రాయాన్ని ఓటింగ్ రూపంలో తీసుకుని, గెలిచిన తరువాత నిర్ణయం తీసుకునే దమ్ముందా? అని సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్ విసిరారు. ఈ ప్రభుత్వం తక్షణం దిగిపోవాలని, మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ప్రజలు మళ్లీ వైసీపీని స్వాగతిస్తే, మూడు రాజధానులకు తాను అడ్డు చెప్పబోనని అన్నారు.

More Telugu News