patancheru: శివాలయ గర్భగుడిలోకి దళిత స్వాములు.. అడ్డుకున్న పూజారి

  • హైదరాబాద్ శివారు పటాన్‌చెరు సమీపంలో ఘటన
  • శివమాల ధరించిన భక్తులను గర్భగుడిలోకి అనుమతించని పూజారి
  • కులాలకు సంబంధం లేదన్న ఈవో

పూజల కోసం గర్భగుడిలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన దళిత శివస్వాములను పూజారి అడ్డుకున్న ఘటన హైదరాబాద్ శివారు పటాన్‌చెరు ప్రాంతంలో జరిగింది. రుద్రారం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు శివమాల ధరించారు. పూజల కోసం వారు నిన్న గ్రామంలోని విఘ్నేశ్వరుడి ఆలయానికి రాగా, గర్భగుడిలోకి వెళ్లకుండా పూజారి చంద్రశేఖర్ వారిని అడ్డుకున్నారు.

తమను అడ్డుకోవడాన్ని వారు నిరసిస్తూ మరికొందరు స్వాములతో కలిసి ఆలయం వద్ద ఆందోళనకు దిగారు. గ్రామంలోని అగ్రవర్ణాల వారినే ఆలయంలోకి అనుమతిస్తూ, తమను అడ్డుకుంటున్నారని ఈ సందర్భంగా వారు ఆలయ కార్యనిర్వహణాధికారి మోహన్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అయితే, ఆయన కూడా స్పందించలేదని స్వాములు ఆరోపించారు. ఆలయంలోకి వెళ్లకుండా తమను అడ్డుకున్న పూజారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అదే సమయంలో ఆలయ సందర్శనకు వచ్చిన జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ దృష్టికి స్వాములు ఈ విషయాన్ని తీసుకెళ్లగా.. అధికారులతో మాట్లాడి లోనికి పంపించే ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, శివ పంచాయన నిబంధనల ప్రకారం.. శివుడు, గణపతి విగ్రహాలు ఉన్న ఆలయ గర్భగుడిలోకి ఎవరినీ అనుమతించబోరని  ఆలయ కార్యనిర్వహణాధికారి మోహన్‌ రెడ్డి  పేర్కొన్నారు. ఈ ఘటనకు, కులాలకు సంబంధం లేదని, ఉన్నతాధికారులు, ఆలయ సిద్ధాంతులతో కలిసి చర్చించిన తర్వాత ఈ విషయమై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

More Telugu News