పవన్‌పై ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి బూతు పురాణం... కాకినాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

12-01-2020 Sun 13:35
  • భానుగుడి సెంటర్‌లో జనసేన కార్యకర్తల ఆందోళన
  • ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఇంటి వద్ద నిరసన
  • జనసేన కార్యకర్తలపై రాళ్లు రువ్విన వైసీపీ కార్యకర్తలు 
  • కాపాడిన పోలీసులు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి బూతులు తిట్టారని భానుగుడి సెంటర్‌లో జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టి అక్కడి నుంచి ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించేందుకు బయలుదేరారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డిని అరెస్టు చేయాలని జనసేన నాయకులు డిమాండ్‌ చేశారు.

ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఇంటి వద్ద జనసేన కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పలువురు జనసేన కార్యకర్తలకు గాయాలయ్యాయి. వైసీపీ కార్యకర్తల దాడి నుంచి జనసేన మహిళా కార్యకర్తలను కాపాడిన పోలీసులు వారిని దగ్గరలోని గుడిలోకి పంపారు. కొందరు జనసేన నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. పవన్ కు తక్షణమే చంద్రశేఖర్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.