శాంతియుతంగా ధర్నా చేస్తున్న మహిళల్ని సిగ్గు లేకుండా బూటు కాలితో తన్నించారు: బుద్ధా వెంకన్న ఫైర్

12-01-2020 Sun 12:02
  • కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తాం అన్నారు
  • కానీ వంగి దండాలు పెడుతున్నారు
  • మీది, జగన్ గారిది సిగ్గు లేని జన్మ కాదా విజయసాయి రెడ్డి గారు?  
  • అమరావతిలో చిన్న పిల్లాడిని పోలీసు వ్యాన్ ఎక్కిస్తారా? 

'చంద్రబాబు లాంటి సిగ్గు లేని వ్యక్తి దేశ రాజకీయాల్లో ఎక్కడా కనిపించడు' అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 'స్పెషల్ స్టేటస్ ఉద్యమంలో పాల్గొంటే అరెస్టు చేస్తామని అప్పట్లో విద్యార్థులు, తల్లిదండ్రులకు వార్నింగులిచ్చాడు. ఇప్పుడేమో తమ ‘ఇన్ సైడర్’ పెట్టుబడులను రక్షించుకునేందుకు స్టూడెంట్సంతా రోడ్ల పైకి రావాలట' అని ట్వీట్లు చేశారు. దీనిపై స్పందించిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆయనకు కౌంటర్ ఇచ్చారు.

'నువ్వు ,జగన్ గారా సిగ్గు గురించి మాట్లాడేది. కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తాం అని వంగి దండాలు పెడుతున్న మీది, జగన్ గారిది సిగ్గు లేని జన్మ కాదా విజయసాయి రెడ్డి గారు? శాంతియుతంగా ధర్నా చేస్తున్న మహిళల్ని సిగ్గు లేకుండా బూటు కాలితో తన్నించిన జగన్ కి సిగ్గు లేదు. అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న వారిపై అక్రమ కేసులా? చిన్న పిల్లాడిని పోలీసు వ్యాన్ ఎక్కిస్తారా?' అని బుద్ధా వెంకన్న విమర్శించారు.
 
'మేము పండుగ చేసుకుంటే చాలు అనుకునేది వైఎస్ కుటుంబం. ప్రజలు కష్టాల్లో ఉంటే మనం పండగ చేసుకోవడం కరెక్ట్ కాదు అనుకునేది చంద్రబాబు కుటుంబం. ఈ రెండిటి మధ్య ఉన్న సున్నితమైన భావాన్ని మీరు అర్థం చేసుకుంటారు అని భావిస్తున్నా సాయి రెడ్డి గారు' అని బుద్ధా వెంకన్న ట్వీట్లు చేశారు. '7 నెలల్లో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వం నాకించి ప్రజలు పండుగకు దూరం అవ్వడానికి చంద్రబాబు గారు కారణం అంటే ఎలా విజయసాయిరెడ్డి గారు?' అని ప్రశ్నించారు.
 
'ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించింది జగన్ గారు. ఆనందంగా పండుగ జరుపుకోవడానికి పేద వాడికి పండుగ కానుక కూడా ఇవ్వని వాడు జగన్. పనులు లేకుండా చేశారు. కనీసం అన్న క్యాంటిన్ లో తిందాం అనుకుంటే అవి కూడా ఎత్తేసారు' అని బుద్ధా వెంకన్న విమర్శించారు.