తనకు దక్కలేదని, మరెవరికీ దక్కరాదని... హారతి హత్య కేసును ఛేదించిన పోలీసులు!

12-01-2020 Sun 09:35
  • వరంగల్ లో ఘటన
  • డిగ్రీ చదువుతున్న సమయం నుంచి ప్రేమ
  • తనను కాదన్నదన్న కారణంతో హత్యాచారం

తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన హారతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో హారతి శుక్రవారం హత్యకు గురికాగా, పోలీసు కమిషనర్ విశ్వనాథ రవీందర్, కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. కాజీపేటకు చెందిన షాహిద్ అలియాస్ చోటూ (24) డిగ్రీ చదువుతున్న సమయంలో అదే కళాశాలలో చదువుతున్న హారతితో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. స్థానిక క్రాంతి నగర్ లో షాహిద్ ఓ గదిని అద్దెకు తీసుకోగా, అక్కడికి హారతి వచ్చి వెళుతుండేది.

ఈ క్రమంలో హారతికి మరో యువకుడితో పరిచయం కాగా, షాహిద్ ను దూరం పెట్టడం ప్రారంభించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన షాహిద్, సదరు యువకుడితోనూ గొడవ పడ్డాడు. తాను, హారతి ప్రేమించుకుంటున్నామని అతను చెప్పడంతో హారతిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. తన వద్దకు రావాలని మెసేజ్ చేశాడు. దీంతో మధ్యాహ్నం ఆమె షాహిద్ గదికి వెళ్లింది. ఆపై, వారిద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. తనకు దక్కని అమ్మాయి మరెవరికీ దక్కరాదన్న ఆలోచనతో, ఆమెపై అత్యాచారానికి పాల్పడిన షాహిద్, గొంతు కోసి హారతిని హత్య చేశాడు.

నిందితుడిపై హత్యాచారం కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసును నమోదు చేశామని విశ్వనాథ రవీందర్ వెల్లడించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించామన్నారు. కాగా, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని హారతి బంధువులు డిమాండ్ చేశారు.