ట్రంప్ ఆదేశించారు... సైన్యం ఫెయిల్... బతికిపోయిన అబ్దుల్ రెజా షహ్లైనీ!

12-01-2020 Sun 08:29
  • ఇరాన్ ప్రధాన సైనిక కమాండర్ అబ్దుల్ రెజా హత్యకు ప్లాన్
  • ఆ సమయంలో యెమెన్ లో ఉండి బతికిపోయిన రెజా
  • అధికారికంగా ప్రకటించిన పెంటగాన్

ఇరాన్ సైనిక జనరల్ సులేమానీని హతమార్చిన రోజే, మరో ఇరాన్ ప్రధాన సైనిక కమాండర్ అబ్దుల్ రెజా షహ్లైనీని కూడా చంపేయాలని అమెరికా నిర్ణయించిందని, అయితే, ఈ ఆపరేషన్ ను యూఎస్ సైన్యం సక్సెస్ చేయలేకపోయిందని తెలుస్తోంది. రిపబ్లికన్ గార్డ్స్ ను ఉగ్రవాద జాబితాలో చేర్చిన అమెరికా, ఇద్దరినీ ఒకే రోజు చంపేస్తే, ఇరాన్ బలగాలు నీరుగారిపోతాయని భావించిన ట్రంప్, అబ్దుల్ రెజాను చంపేందుకు కూడా అనుమతి ఇచ్చారని సమాచారం. అయితే, తామనుకున్న వ్యూహాన్ని అమలు చేయడంలో యూఎస్ సైన్యం విఫలమైంది. దీంతో అబ్దుల్ రెజా బతికిపోయారు. అమెరికా దాడి చేయాలని భావించిన సమయంలో ఆయన యెమెన్ లో ఉండటమే ఇందుకు కారణం.

తమ ప్రణాళిక అమలుకు వేచి చూశామని, అది విఫలమైనందున మరిన్ని విషయాలు చెప్పలేమని పెంటగాన్ అధికార ప్రతినిధి రెబెకా రెబరిచ్ వ్యాఖ్యానించారు. షియా మిలిటెంట్ గ్రూపులకు ఆయుధాలను, నిధులను అందిస్తోంది అబ్దుల్ రెజా అని అమెరికా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అతని కార్యకలాపాలపై సమాచారం ఇస్తే, భారీ మొత్తంలో నజరానా ఇస్తానని అమెరికా ప్రకటించింది.