తేజస్ మరో ఘనత... ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై ల్యాండింగ్!

12-01-2020 Sun 06:45
  • 'మేకిన్ ఇండియా' ఫైటర్ జెట్ గా తేజస్
  • అభివృద్ధి చేసిన డీఆర్డీఓ, ఏడీఏ, హెచ్ఏఎల్
  • గొప్ప మెట్టును అధిగమించామన్న రాజ్ నాథ్ సింగ్

ఇండియన్ నేవీకి సేవలందించే విషయంలో 'మేకిన్ ఇండియా' తేజస్ ఫైటర్ జెట్, మరో ఘనతను సాధించింది. ఈ విమానం యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై విజయవంతంగా ల్యాండ్ అయింది. దీంతో యుద్ధ విమాన వాహక నౌకలపై ఫైటర్ జెట్ లను ల్యాండ్ చేసే సత్తా ఉన్న అతికొద్ది దేశాల జాబితాలో ఇండియా కూడా చేరింది.

కాగా, తేజస్‌ విమానాన్ని డీఆర్డీఓ (భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ), ఏడీఏ (ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ)లతో పాటు హిందూస్థాన్ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్ అధీనంలోని ఎయిర్ క్రాఫ్ట్‌ రీసెర్చ్‌ అండ్‌ డిజైన్‌ సెంటర్‌, సీఎస్‌ఐఆర్‌ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం 10 గంటల 2 నిమిషాలకు తేజస్‌ ఫైటర్ జెట్ ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై ల్యాండ్ అయినట్టు డీఆర్‌డీవో ప్రకటించింది.

ఫైటర్ జెట్స్ ను నావికాదళానికి అందించడంలో ఇండియా ఓ గొప్ప మెట్టును అధిగమించిందని రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. నావికాదళానికి సంబంధించిన తేజస్‌ లైట్‌ యుద్ధ విమానం ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. సాధ్యమైనంత త్వరగా, ఈ విమానాన్ని సిద్ధం చేసి నేవీకి అందిస్తామని డీఆర్డీఓ చెబుతోంది.