ATM: ఏటీఎంలో వందకు బదులు ఐదు వందల నోట్లు!

  • కర్ణాటకలో ఓ బ్యాంకు ఏటీఎంలో విచిత్రం
  • విషయం బ్యాంకుకు తెలిసేలోపే రూ.1.7 లక్షలు విత్ డ్రా
  • వంద నోట్లుంచే ట్రేలో ఐదు వందల నోట్లు ఉంచడమే కారణం

ఆ ఏటీఎంలో వందరూపాయల నోట్లకు బదులు ఐదువందల నోట్లు రావడంతో కార్డు కలిగినవాళ్లు క్యూ కట్టారు. ఈ విషయం కొందరు బ్యాంకు అధికారులకు తెలిపే లోపే రూ.1.7 లక్షల నగదును విత్ డ్రా చేసుకుని వెళ్లిపోయారు. ఈ విషయంపై తమకు బ్యాంకు ఎలాంటి ఫిర్యాధు చేయలేదని పోలీసులు తెలుపుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని కొడగు పట్టణంలోని మడికేరిలో ఓ ఏటీఎంలో ఈ విచిత్ర పరిస్థితి ఏర్పడింది. వినియోగదారులు డబ్బును విత్ డ్రా చేసుకుంటూంటే రూ.100 నోట్లకు బదులు రూ.500 నోట్లు రావడంతో ఆశ్చర్యపోయినప్పటికీ.. వచ్చిన డబ్బును జేబులో పెట్టుకొని వెళ్లిపోయారు.

దీనిపై జిల్లా ఎస్పీ సుమన్ పనెక్కర స్పందిస్తూ.. ఏటీఎంకు సంబంధించి బ్యాంకు నుంచి తమకు ఫిర్యాదు రాలేదన్నారు. ఏటీఎంలో నగదును ఉంచే సంస్థ పొరబాటు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. రూ.100 నోట్లు ఉంచాల్సిన ట్రేలో రూ.500 నోట్లు ఉంచిందని వెల్లడించారు. బ్యాంకు అధికారులు డబ్బును విత్ డ్రా చేసినవారిని గుర్తించి జరిగిన పొరబాటును వివరిస్తూ.. అదనపు డబ్బును ఇవ్వాలని కోరగా కొంతమంది మాత్రమే ఇచ్చారు.

ఇదిలా ఉండగా, ఏటీఎంలో నగదును ఉంచే సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారి జోక్యంతో డబ్బు ఇవ్వని వారు సైతం తమకు వచ్చిన అదనపు డబ్బును తిరిగి ఇవ్వడంతో కథ సుఖాంతమైంది.

More Telugu News