JNU: జేఎన్‌యూ దాడి ఘటనలో అనుమానితుల గుర్తింపు.. నిందితుల్లో జేఎన్‌యూ అధ్యక్షురాలు!

  • ఈ నెల 5న యూనివర్సిటీ క్యాంపస్‌లో దాడి
  • సర్వర్ రూము ధ్వంసం.. హాస్టల్ గదులపై ప్రతాపం
  • ఫొటోలు విడుదల చేసిన పోలీసులు

ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో దాడి ఘటనకు సంబంధించి తొమ్మిది మంది అనుమానితుల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. ఇందులో జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు ఐషే ఘోష్ కూడా ఉండడంతో కేసు కీలక మలుపు తిరిగినట్టు అయింది. నిందితులకు సంబంధించి కొన్ని ఫొటోలను నిన్న రాత్రి పోలీసులు విడుదల చేశారు.  

ముఖాలకు ముసుగు, చేతిలో లాఠీలతో ఈ నెల 5న యూనివర్సిటీలోకి చొరబడిన దుండగులు దాడికి పాల్పడ్డారు. హాస్టల్ ఫీజులు పెంచిన కారణంగా ఐషే ఘోష్‌తోపాటు పలు విద్యార్థి సంఘాలకు చెందిన సభ్యులు పెరియార్ హాస్టల్‌లోని గదులపై ప్రతాపం చూపారు. అలాగే, జేఎన్‌యూలోని సర్వర్ రూమును ధ్వంసం చేశారు.

సీసీటీవీ ఫుటేజీలు లభ్యం కాకపోవడంతో నిందితులను గుర్తించడం కొంత కష్టమైందని చెప్పిన పోలీసులు.. దాడికి సంబంధించిన ఫొటోలను నిన్న విడుదల చేశారు. అనుమానితుల్లో జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు ఐషే ఘోష్ కూడా ఉన్నట్టు తెలిపారు. దాడి ఘటనకు సంబంధించి మూడు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్టు పేర్కొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

More Telugu News