వెనక్కి తగ్గని పృథ్వీ... మరోసారి అవే వ్యాఖ్యలు చేసిన ఎస్వీబీసీ చైర్మన్!

10-01-2020 Fri 20:49
  • ఆందోళన చేస్తున్నవారిలో పెయిడ్ ఆర్టిస్టులున్నారని పునరుద్ఘాటన
  • కటౌట్లు తగలబెట్టినా పట్టించుకోనని వెల్లడి
  • విమర్శలు చేసేవారు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక

అమరావతిలో ఆందోళన చేస్తున్నది రైతులు కాదని, పెయిడ్ ఆర్టిస్టులంటూ వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలపాలైన సినీ నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఆందోళనల్లో పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారంటూ పునరుద్ఘాటించారు. పెయిడ్ ఆర్టిస్టుల సంస్కృతి తెచ్చిందే టీడీపీ అని విమర్శించారు. తన వ్యాఖ్యల పట్ల ఎవరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు.

తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడితే స్పందించబోనని, తన కటౌట్లు తగలబెట్టినా పట్టించుకోనని తెలిపారు. తాను వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగానే మాట్లాడానని అన్నారు. అమరావతిలో బినామీ రైతుల పేరుతో టీడీపీ నేతలు భూములు కొన్నారన్నది వాస్తవం అని ఆరోపించారు. తానేమీ రైతుల మనోభావాలు దెబ్బతీయలేదని స్పష్టం చేశారు. విమర్శలు చేసేవారు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.