మన రాజధాని ఏదంటే ‘పిచ్చి తుగ్లక్’ పేరు చెప్పాలా?: చంద్రబాబునాయుడు

10-01-2020 Fri 19:57
  • మూడు రాజధానులు కావాలని ఎవరైనా అడిగారా?
  • రాజధాని అమరావతిని మార్చమని ఎవరు అడిగారు?
  • మూడు రాజధానులంటే పేకాటలో మూడు ముక్కలాట కాదు

ఏపీకి మూడు రాజధానులు కావాలని ఎవరైనా అడిగారా? రాజధానిగా ఉన్న అమరావతిని మార్చమని ఒక్క వ్యక్తి అయినా అడిగారా? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్నది ‘పేకాటలో మూడు ముక్కలాట’ కాదంటూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

అన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయని, అదే మన రాష్ట్రానికి రాజధాని ఏంటని అడిగితే ఏమని చెప్పాలి? అని ప్రశ్నించారు. మన రాజధాని ఏదంటే అమరాతి పేరు చెప్పాలా? కర్నూలు పేరు చెప్పాలా? విశాఖ పేరు చెప్పాలా? లేక ‘పిచ్చి తుగ్లక్ పేరు చెప్పాలా?’ అంటూ ధ్వజమెత్తారు. మూడు రాజధానుల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. ‘అధికార వికేంద్రీకరణ’ అని చెబుతోందని, కావాల్సింది ‘అభివృద్ధి వికేంద్రీకరణ’ అని,  ఏపీలో అభివృద్ధి కావాలి, ఉద్యోగాలు కావాలని అన్నారు.