ఆమె తర్వాత కోర్టు బోనులో నిలబడిన సీఎం జగనే!: అశోక్ గజపతిరాజు

10-01-2020 Fri 15:26
  • జయలలిత తర్వాత బోనులో నిలబడింది జగన్ మాత్రమే
  • రాష్ట్రానికి తలవంపులు తేవడం సిగ్గుచేటు
  • రాజధానిని తరలించే శక్తి ఎవరికీ లేదు

అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ అంశం విపక్షాలకు బాగా కలిసొచ్చింది. ఈ క్రమంలో జగన్ పై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టాయి. ముఖ్యమంత్రి హోదాలో జయలలిత తర్వాత కోర్టు బోనులో నిలబడింది జగన్ మాత్రమేనని టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఎద్దేవా చేశారు. బోనులో నిలబడి రాష్ట్రానికి తలవంపులు తేవడం సిగ్గుచేటని అన్నారు. రాజధానిని అమరావతి నుంచి తరలించే శక్తి ఎవరికీ లేదని చెప్పారు.

తల నొప్పి వస్తే ఎవరైనా మాత్ర వేసుకుంటారని... తల తీసేయరని అన్నారు. విజయనగరంలోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు విపక్షాలు భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.