Odisha: పర్లాకిమిడి గజపతుల ఆఖరి వారసుడు గోపీనాథ్ గజపతి అస్తమయం

  • కన్ను మూసిన రాజా గోపీనాథ్ నారాయణ్ దేవ్ 
  • గుండె సంబంధిత సమస్యతో బరంపురం ఆసుపత్రిలో ఆఖరిశ్వాస 
  • రెండుసార్లు బరంపురం ఎంపీగా గెలుపొందిన గోపీనాథ్

గజపతుల వంశస్తుల్లో ఆఖరివాడైన గోపీనాథ్ గజపతి నారాయణ్ దేవ్ ఈ రోజు తెల్లవారు జామున నాలుగు గంటలకు కన్నుమూశారు. మూడేళ్లుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనకు కొన్ని రోజుల క్రితం సుస్తీ చేయడంతో కుటుంబ సభ్యులు బరంపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆఖరి శ్వాస వదిలారు. ఈయనకు కుమార్తె కల్యాణి దేవి ఉన్నారు.

ఉత్తరాంధ్ర, ఒడిశాలోని పలు ప్రాంతాలతో కూడిన గజపతుల రాజ్యం చాలా ఏళ్లు కొనసాగింది. పర్లాకిమిడి కేంద్రంగా వీరు పరిపాలించేవారు. ఒడిశాలో గజపతి రాజుల పాలనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తూర్పు గంగా వంశీకులైన గజపతులు ఏడు శతాబ్దాల పాటు పర్లాకిమిడి సామ్రాజ్యాన్ని పాలించారు. గజపతి రాజుల్లో మొదటివాడైన కృష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్‌కు గోపీనాథ్ గజపతి మనవడు.

ఒడిశాతోపాటు ఉత్తరాంధ్ర సరిహద్దుల్లో గజపతి వంశస్థులకు స్థానికులు ప్రత్యేక గౌరవ మర్యాదలు ఇస్తారు. పర్లాకిమిడిలోని కోట, ఇతరత్రా చాలా ఆస్తులను వీరు విద్యా సంస్థలకు దానం ఇచ్చేశారు. గజపతుల్లో ఆఖరివాడైన గోపీనాథ్ కు కుమార్తె మాత్రమే ఉండడంతో వీరి వంశం ఇక ముగిసినట్టే.

1943లో జన్మించిన గోపీనాథ్ బరంపురం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి 1989, 1991 సంవత్సరాల్లో రెండు సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి  గెలుపొందారు. ఆ తర్వాత ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 1998లో రాష్ట్రంలోని అధికార పార్టీ బీజేడీలో చేరారు.

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గోపీనాథ్ మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గోపీనాథ్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గోపీనాథ్ గజపతి అంత్యక్రియలు ఈ రోజు పర్లాకిమిడిలో జరగనున్నాయి. ప్రభుత్వం తరపున ఒడిశా అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బిక్రమ్ కేసరీ అరుక్ హాజరై గోపీనాథ్ కు అంజలి ఘటిస్తారు.

More Telugu News