అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుంటే లేచి నిలబడిన 'చనిపోయిన' మహిళ... దెయ్యమంటూ బంధుమిత్రుల పరుగులు!

10-01-2020 Fri 10:49
  • పాకిస్థాన్ లోని కరాచీలో ఘటన
  • డెత్ సర్టిఫికెట్ జారీ చేసిన వైద్యులు
  • మృతదేహానికి స్నానం చేయిస్తుంటే తిరిగొచ్చిన ప్రాణం

చనిపోయారని తెలుసుకుని ఇంటికి తీసుకుని వచ్చి, అంత్యక్రియలకు సిద్ధమవుతున్న సమయంలో సదరు వ్యక్తి లేచి కూర్చున్నారని ఎన్నో వార్తలు వినే ఉంటాము. ఇది కూడా అటువంటిదే. ఈ ఘటన పాకిస్థాన్ లోని కరాచీలో జరిగింది. రషీదా షబీ అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతుండగా, కుటుంబీకులు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆమె మరణించినట్టు ధ్రువీకరించిన వైద్యులు డెత్ సర్టిఫికెట్ ను జారీ చేశారు.

దీంతో కుటుంబీకులు ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకుని వచ్చి, అంత్యక్రియల ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఆమెకు స్నానం చేయిస్తుండగా, అకస్మాత్తుగా రషీదా లేచి నిలబడింది. దీంతో అక్కడున్న వారు తీవ్ర భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకుని కుటుంబీకులు షాక్ నకు గురికాగా, వైద్యులు వచ్చి, ఆమె ఇంకా బతికే ఉందని శ్వాస తీసుకుంటోందని తేల్చారు. ఈ వార్త ఆ ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశమైంది.