కోహ్లీ మరొక్క పరుగు చేస్తే ధోనీ రికార్డు బద్దలే!

10-01-2020 Fri 09:10
  • 11 వేల పరుగుల మైలురాయికి ఒక్క పరుగు దూరంలో కోహ్లీ
  • ధోనీ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా రికార్డుల్లోకి
  • ఓవరాల్‌గా ఆరో క్రికెటర్

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మరో ఘనతను తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమయ్యాడు. పూణెలో నేడు శ్రీలంకతో జరగనున్న మూడో టీ20లో కోహ్లీ కనుక మరొక్క పరుగు సాధిస్తే కెప్టెన్‌గా 11 వేల పరుగులు సాధించిన రెండో ఇండియన్ క్రికెటర్‌గా, ఓవరాల్‌గా ఆరో క్రికెటర్‌గా రికార్డులకెక్కుతాడు. భారత్ తరపున టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ మాత్రమే ఇప్పటి వరకు ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు కోహ్లీ అతడి సరసన చేరనున్నాడు.

ఇండోర్‌లో శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 30 పరుగులు చేసిన విరాట్ ఖాతాలో ప్రస్తుతం 10,999 పరుగులున్నాయి. దీంతో నేటి మ్యాచ్‌లో 11 వేల పరుగుల మైలురాయిని అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు, నేటి మ్యాచ్‌లో కోహ్లీసేన విజయం సాధిస్తే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2-0తో భారత్ సొంతమవుతుంది.