ఇది వాస్తవం కాదని రామోజీరావు గారిని చెప్పమనండి?: మంత్రి బొత్స

09-01-2020 Thu 16:41
  • వయసు పెరిగింది..అనుభవం ఉంది
  • ఎందుకు ఇలాంటి రాతలు?
  • ఏం సాధించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు?

ఆంధ్రప్రదేశ్ ‘ఈనాడు’ ఎడిషన్ లో ఈరోజు ప్రచురితమైన ఓ కథనంపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, "ఈనాడు పత్రికలో ‘ఇవి తెలుసా? అని హెడ్డింగ్ పెట్టి ‘సచివాలయం..  2016 అక్టోబరు నుంచి పాలన సాగుతోంది’ అని రాశారు. అవును.. సాగుతోంది. కాదని ఎవరూ అనలేదు. కానీ, తాత్కాలిక సచివాలయంలో పాలన సాగుతోందన్న మాట. ‘తాత్కాలిక’ అన్న మాటను దాచారు. ఇది వాస్తవం కాదని రామోజీరావు గారిని చెప్పమనండి?

అదే విధంగా, 2017 నుంచి శాసనమండలి, శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయని రాశారు. ఇక్కడ కూడా, ‘తాత్కాలిక’ అన్న పదాన్ని రాయలేదు. ‘హంగులన్నీ అమరిన రాజధాని.. అమరావతిలో అదనంగా ఖర్చు చేయాల్సిన అవసరమే లేదు’ అంటూ ఈరోజు ‘ఈనాడు’లో ఈ కథనం ప్రచురించారు. ఇదే పత్రికలో ఎన్నికలకు ముందు (డిసెంబర్ 24, 2018) ‘నిలువెత్తు దగా’ అనే శీర్షికతో రాజధానికి సాయం కావాలని కోరుతూ ఓ కథనాన్ని ప్రచురించారు" అని చెప్పిన బొత్స, ఈ రెండు కథనాలను పోల్చి చూస్తూ విమర్శలు చేశారు.

"అందుకే, ఇతనికి (రామోజీరావు)  సామాజిక స్ఫూర్తి కంటే.. ‘సమాజ’ స్ఫూర్తి ఎక్కువగా ఉంది అని నేను అన్నాను" అంటూ రామోజీరావుపై విమర్శలు చేశారు. ‘వయసు పెరిగింది.. అనుభవం ఉంది. ఎందుకు ఇలాంటి రాతలు రాసుకుని ఏం సాధించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు? దేనికోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నారు?’ అంటూ రామోజీరావుపై బొత్స ప్రశ్నల వర్షం కురిపించారు.