మహేశ్ బాబు చిత్రానికి ప్రత్యేక ఆటలకు ఏపీ ప్రభుత్వం అనుమతి

09-01-2020 Thu 12:40
  • 11వ తేదీన విడుదలవుతోన్న 'సరిలేరు నీకెవ్వరు'
  • ప్రత్యేక షోలు వేసుకోవడానికి అనుమతి కోరిన నిర్మాత
  • 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం

మహేశ్ బాబు తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. జనవరి 11న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు, ఏపీలో ప్రత్యేక షోలు వేసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ నిర్మాత అనిల్ సుంకర ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు.

ఈ లేఖను పరిశీలించిన ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ప్రతి రోజు అదనంగా రెండు షోలు వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో.. ఈ చిత్రానికి సంబంధించి రోజుకు 6 షోలు వేసుకోవచ్చు.