ప్రకాశం జిల్లాలో రాజధాని కావాలంటూ జిల్లా కాంగ్రెస్ నేతల దీక్ష

09-01-2020 Thu 10:52
  • ఆమరణ దీక్షకు దిగిన యువజన విభాగం అధ్యక్షుడు శ్రీపతి సతీశ్
  • 'పేరుకే ప్రకాశం, లేదు జిల్లాకు వికాసం' అంటూ నినాదాలు
  • కందూకూరులో అమరావతికి మద్దతుగా టీడీపీ నేతల దీక్ష

ఆంధ్రప్రదేశ్ లో అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఒక పక్క ఆందోళనలు కొనసాగుతూండగా.. మరోపక్క రాజధానిని ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయాలంటూ ఆ జిల్లా కాంగ్రెస్ నేతలు సరికొత్తగా ఆందోళనను లేవనెత్తారు. ఈ రోజు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు శ్రీపతి సతీశ్ ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ‘మన ప్రకాశం జిల్లా మన భవిష్యత్తు’, ‘పేరుకే ప్రకాశం, లేదు జిల్లాకు వికాసం’ అంటూ నినాదాలు చేశారు.

శివరామకృష్ణన్ కమిటీ సూచించిన సిఫారసుల మేరకు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉన్న ప్రకాశంను రాజధాని చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా అదే జిల్లాలో మరోపక్క అమరావతి రాజధానిగా ఉండాలంటూ టీడీపీ దీక్షలకు దిగింది. కందుకూరులో అమరావతి పరిరక్షణకోసం టీడీపీ ఎస్సీ సెల్ నేతలు దీక్షకు దిగారు.