నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా ఎమ్మెల్యేగా గెలవలేవు: సోమిరెడ్డిపై రోజా ఫైర్

08-01-2020 Wed 16:53
  • సీఎం జగన్ పై విమర్శలకు రోజా కౌంటర్
  • రాజధానిపై రగడతో.. నేతల మధ్య వాగ్యుద్ధం?
  • రాజధాని సమస్యకు మూలం వైసీపీ అన్న సోమిరెడ్డి

వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా సోమిరెడ్డిని విమర్శిస్తూ ‘నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా ఎమ్మెల్యేగా గెలవలేవు’ అని ట్వీట్ చేశారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో పోటీచేసిన సోమిరెడ్డి వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో రోజా సోమిరెడ్డికి ఈ సవాల్ విసిరారు. నిన్న సోమిరెడ్డి రాజధాని సమస్యకు వైసీపీ ప్రభుత్వమే కారణమంటూ.. జగన్ తలకిందులుగా తపస్సు చేసినా అమరావతి రాజధానిని మార్చలేరు అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఏపీ రాజధానిగా అమరావతి అభివృద్ధి పథంలో సాగుతున్న క్రమంలో, అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసి ప్రజల్లో ఆందోళనలు రేపిందని ధ్వజమెత్తారు. ప్రధాని రాజధానికోసం శంకుస్థాపన చేసి నిధులు కూడా ఇచ్చాక రాజధాని మార్చుతామనడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. జగన్ కు సలహాలు ఇచ్చేందుకు సరైన మంత్రులు లేరా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు.