వరల్డ్ కప్ కోసం సరికొత్త అస్త్రంపై కన్నేసిన టీమిండియా!

08-01-2020 Wed 15:05
  • కోహ్లీ దృష్టిలో పడిన కర్ణాటక యువ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ
  • దేశవాళీ పోటీల్లో రాణిస్తున్న ప్రసిద్ధ్
  • భీకరమైన పేస్ తో వికెట్లు రాబట్టే బౌలర్ గా గుర్తింపు

ఇప్పుడున్న పేస్ బౌలర్లతో టీమిండియా ప్రపంచంలో ఏ జట్టునైనా ఓడించగలదని క్రికెట్ పండితుల అభిప్రాయం. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మలతో కూడిన భారత పేస్ దళం కొన్నాళ్లుగా రాణిస్తున్న వైనం చూస్తే ఎవరికీ ఎలాంటి అనుమానాలు కలగవు. ఇప్పుడు నవదీప్ సైనీ రూపంలో ఓ సూపర్ ఫాస్ట్ బౌలర్ భారత అమ్ములపొదిలో చేరాడు. అయితే, ఈ ఏడాది ద్వితీయార్థంలో ఆస్ట్రేలియా గడ్డపై టి20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో అక్కడి పేస్ పిచ్ లపై ఓ కొత్త అస్త్రాన్ని ప్రయోగిస్తామని కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటున్నాడు. ఆ అస్త్రం పేరు ప్రసిద్ధ్ కృష్ణ.

దేశవాళీ క్రికెట్ లో కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న ఈ కర్ణాటక యువకిశోరం సాధారణమైన భారత పిచ్ లపై అమోఘమైన పేస్ ను రాబడుతున్నాడు. 23 ఏళ్ల ప్రసిద్ధ్ కృష్ణ ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఫాస్ట్ బౌలింగ్ కు సహకరించే ఆసీస్ పిచ్ లపై ప్రసిద్ధ్ ను ప్రయోగించాలని కోహ్లీ భావిస్తున్నాడు. కెప్టెన్ కోహ్లీ నమ్మకం చూరగొనడంతో ప్రసిద్ధ్ కృష్ణ వరల్డ్ కప్ టీమ్ లో ఎంపికవడం లాంఛనమేననిపిస్తోంది. అయితే, జట్టులో అలవాటు పడేందుకు వరల్డ్ కప్ ముందు ఒకటి, రెండు సిరీస్ లలో ఈ ఆరడుగుల బౌలర్ ను పరిశీలించే అవకాశాలున్నాయి.