అయినా.. 'జబర్దస్త్' రేటింగ్ మాత్రం 'అదిరింది'!

08-01-2020 Wed 12:26
  • 'జబర్దస్త్' కి తగ్గని ఆదరణ 
  • ఆశించిన స్థాయిలో ఆకట్టుకోని 'అదిరింది'
  • పోటీ వాతావరణంలో రెండు కార్యక్రమాలు

బుల్లితెరపై కామెడీ షో అనగానే 'జబర్దస్త్' గుర్తుకు వచ్చేంతగా ఆ షో పాప్యులర్ అయింది. పేరు పరంగా .. డబ్బు పరంగా ఈ కార్యక్రమం కొంతమందిని నిలబెట్టేసింది. కొంతమంది ఆర్టిస్టులు వెండితెరకి పరిచయం కావడంలో ప్రధానమైన పాత్రను పోషించింది. అలాంటి ఈ షో నుంచి ఇటీవల నాగబాబు తప్పుకున్నారు. ఆయన వెంటే కొంతమంది కమెడియన్స్ బయటికి నడిచారు. వీరంతా కలిసి వేరే చానల్ కి 'అదిరింది' అనే కామెడీ షో చేస్తున్నారు.

దాంతో సహజంగానే 'జబర్దస్త్' .. 'అదిరింది' కార్యక్రమాలను పోల్చి చూడటం జరుగుతోంది. నాగబాబు బయటికి వెళ్లిన తరువాత 'జబర్దస్త్' షోకి ఎంతమాత్రం రేటింగ్ తగ్గకపోవడం విశేషం. ఇక నాగబాబుతోనే మొదలైన 'అదిరింది' రేటింగ్ పరంగా జబర్దస్త్ కి చాలా దూరంగానే ఉండిపోతోంది. 'అదిరింది' ప్రసారమయ్యే సమయానికి ఇవతల చానల్ వారు 'జబర్దస్త్' పాత ఎపిసోడ్స్ లో కొంత భాగాన్ని ఎడిట్ చేసి .. హైలైట్స్ ను ప్రసారం చేస్తున్నారు. ఇలా ఈ రెండు కార్యక్రమాలు పోటీ వాతావరణంలో ప్రసారమవుతున్నాయి.