Cyber Crime: ఉగ్రదాడుల్లో బంగారం దొరికిందని నమ్మించి... రూ. 3.88 లక్షలు నొక్కేసిన కేటుగాళ్లు!

  • చాటింగ్ కోసం ఆన్ లైన్ లో వెతికిన వ్యక్తి
  • ఫాతిమా పేరిట పరిచయమైన యువతి
  • బహుమతి పంపానంటే నమ్మి లక్షలు సమర్పించుకున్న వైనం

సిరియాలో జరుగుతున్న ఉగ్రదాడుల్లో తనకు బంగారం, యూఎస్ డాలర్లు దొరికాయని ఓ వ్యక్తిని నమ్మించిన కేటుగాళ్లు, రూ. 3.88 లక్షలు నొక్కేశారు. ఈ ఘటన సైబరాబాద్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే, 38 సంవత్సరాల బాధితుడు టైమ్ పాస్ కోసం ఎవరితోనైనా చాటింగ్ చేయాలని భావించి, ఆన్ లైన్ లో వెతుకగా, ఇండియన్ చాట్ రూమ్స్ కనిపించింది. అందులో వివరాలు నమోదు చేశాడు.

ఈ క్రమంలో +13092042667 అనే నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. తన పేరు ఫాతిమా మహమ్మద్ అని పరిచయం చేసుకున్న ఓ యువతి, తనది సిరియా అని చెప్పింది. ఉగ్రవాదులు దాడులు చేసి వెళ్లిన తరువాత, తనకు బంగారం, డాలర్లు దొరికాయని, వాటిని మీకు పంపుతానని నమ్మించింది.

ఆపై 7040248655 అనే నంబర్ నుంచి కాల్ వచ్చింది. బంగారం, డాలర్స్ ఉన్న రెండు బాక్స్ లు మీకు వచ్చాయని, కన్వర్షన్, యాంటీ లాండరింగ్, కస్టమ్స్ సుంకాలు చెల్లిస్తే, వాటిని పంపుతామని ఫోన్ లో చెప్పారు. సదరు ఫోన్ చేసిన వ్యక్తి, ఎస్బీఐ ఖాతాను ఇవ్వగా, పలు దఫాలుగా బాధితుడు డబ్బును జమ చేశాడు. ఆపై ఇటీవల ఓ వ్యక్తి వచ్చి, యూఎస్ కరెన్సీ బాక్స్ అంటూ ఓ గిఫ్ట్ బాక్స్ ఇచ్చి, కొరియర్ చార్జీలు ఇవ్వాలంటూ రూ. 50 వేలు తీసుకుని వెళ్లాడు.

ఆపై దాన్ని తెరచి చూడగా, నకిలీ కరెన్సీ ఉంది. దీంతో బాధితుడు తాను దారుణంగా మోసపోయానని భావించి, పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు, దర్యాఫ్తు ప్రారంభించారు.

More Telugu News