సల్మాన్ ఖాన్ నుంచి కిచ్చ సుదీప్ కు అదిరిపోయే గిఫ్ట్!

07-01-2020 Tue 21:19
  • ఇటీవలే సల్మాన్ తో దబాంగ్-3లో నటించిన సుదీప్
  • బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన చిత్రం
  • బీఎండబ్ల్యూ ఎం5 కారును కానుకగా ఇచ్చిన సల్మాన్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఎంత ఉదార స్వభావుడో ఆయన వల్ల సాయం పొందినవాళ్లు, ఊహించని రీతిలో కానుకలు అందుకున్నవాళ్లే చెప్పాలి. ఇప్పుడు ప్రముఖ దక్షిణాది నటుడు కిచ్చ సుదీప్ కూడా సల్మాన్ ఖాన్ గురించి గొప్పగా చెబుతున్నాడు. అందుకు కారణం ఉంది. ప్రభుదేవా డైరెక్షన్ లో సల్మాన్ ఖాన్, కిచ్చ సుదీప్ నటించిన దబాంగ్-3 చిత్రం ఇటీవలే విడుదలై రికార్డుల మోత మోగించింది.

ఇందులో కిచ్చ సుదీప్ పోషించింది విలన్ పాత్రే అయినా ప్రేక్షకుల నుంచి గుర్తింపు లభించింది. ఇక ఈ సినిమా షూటింగ్ సందర్భంగా సల్మాన్, సుదీప్ ల మధ్య స్నేహం ఏర్పడింది. తనతో పరిచయం ఉన్నవాళ్లనే ఖరీదైన చేతివాచీలు ఇచ్చి సర్ ప్రైజ్ చేసే సల్మాన్... ఎంతో ఫ్రెండ్లీగా ఉండే సుదీప్ ను ఎందుకు వదులుతాడు?  అందుకే ఓ ఖరీదైన బీఎండబ్ల్యూ ఎం5 కారును సుదీప్ ఇంటి ముందు నిలిపి సిసలైన సర్ ప్రైజ్ ఏంటో చూపించాడు. మార్కెట్లో ఈ కారు విలువ రూ.1.7 కోట్లు వరకు ఉంటుంది.

ఈ విషయాన్ని సుదీప్ స్వయంగా వెల్లడించాడు. "మనం మంచిగా ఉన్నంతకాలం మంచే జరుగుతుంది. ఈ వాక్యాన్ని నన్ను నమ్మేలా చేసిన వ్యక్తి సల్మాన్ ఖాన్. ఇప్పుడు బీఎండబ్ల్యూ ఎం5 కారుతో మా ఇంటి ముందు వాలిపోయి ఆ విషయాన్ని నిరూపించాడు. నాపైనా, నా కుటుంబంపైనా మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు థాంక్యూ సర్. మీతో కలిసి పనిచేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. మీరు మా ఇంటికి రావడం ఎంతో సంతోషంగా ఉంది" అంటూ సుదీప్ ట్విట్టర్ లో స్పందించాడు.