సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: నిర్భయ దోషుల తరపు న్యాయవాది

07-01-2020 Tue 19:56
  • విచారణ నిష్పక్షపాతంతో జరగలేదు
  • ఈ దేశంలో ఉరిశిక్ష పేదలకే పడుతోంది
  • ధనవంతులకు ఉరిశిక్ష వేయరు

నిర్భయ దోషులకు పటియాలా కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ పై సుప్రీంకోర్టుకు వెళతామని దోషుల తరపు న్యాయవాది ఏపీ సింగ్ మీడియాతో చెప్పారు. నిర్భయ దోషులకు విధించిన ఉరిశిక్ష అమలు జాప్యంపై తల్లిడండ్రులు పెట్టుకున్న పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు దోషులకు ఈ నెల 22న ఉదయం 7 గంటలకు ఉరిశిక్షను అమలు చేయాలని తీర్పును ప్రకటించింది.

ఈ నేపథ్యంలో.. దోషుల తరపు న్యాయవాది శిక్షపై తాము సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు మీడియాతో అన్నారు. విచారణ నిష్పక్షపాతంతో జరగలేదని ఆయన ఆరోపించారు. 'ఈ దేశంలో ఉరి తాడు పేదవారికోసమే తయారు చేస్తున్నారు. వారికే ఉరిశిక్ష పడుతోంది. సంపన్నులకు ఉరిశిక్ష వేయరని' సింగ్ వ్యాఖ్యానించారు. ఈ మాటను తానొక్కడే అనటం లేదని.. గతంలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన కూడా అన్నారని తెలిపారు.