భావోద్వేగంతో.. కంటతడి పెట్టిన కివీస్ క్రికెటర్ రాస్ టేలర్

07-01-2020 Tue 19:04
  • కివీస్ తరపున టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డు సొంతం   
  • ఆసీస్ ఆడుతూ రికార్డు నమోదు
  • స్టీఫెన్ ఫ్లెమింగ్ ను వెనక్కి నెట్టిన టేలర్

న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్ ఆ దేశం తరపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆవిర్భవించాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు, రెండో ఇన్నింగ్స్ లో టేలర్ 22 పరుగులు చేయడంతో ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతకుముందు కివీస్ ఆటగాడు స్టీఫెన్ ఫ్లెమింగ్ చేసిన 7,172 అత్యధిక పరుగుల రికార్డును అధిగమించాడు. ఈ నేపథ్యంలో జట్టు సహచరులు టేలర్ ను అభినందించారు. ఈ మ్యాచ్ ను అసీస్ కు కోల్పోయినప్పటికీ.. టేలర్ రికార్డు కివీస్ కు కాసింత ఉపశమనం కలిగించిదని చెప్పవచ్చు.

మ్యాచ్ అనంతరం టేలర్ మీడియాతో మాట్లాడుతూ.. ఉద్వేగానికి లోనయ్యాడు. మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ రికార్డును అధిగమించిన తర్వాత, మార్టిన్ క్రో గుర్తుకు రావడంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. మార్టిన్ క్రో తనకు ప్రేరణ అని చెప్పాడు. కేన్సర్ తో బాధపడుతూ క్రో 2016లో మృతి చెందాడని గుర్తు చేసుకున్నాడు.

భావోద్వేగాలను నియంత్రించుకోలేక గదిలోకి వెళ్లి ఎనిమిది నిమిషాల తర్వాత మళ్లీ మీడియా ముందుకు వచ్చాడు. రాస్ టేలర్ ఇప్పటివరకు 111 టెస్టులు ఆడి 7,174 పరుగులు చేసి తన దేశం తరపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా కొనసాగుతున్నాడు. వన్డేల్లో కూడా టేలర్ దే హవా. మొత్తం 8,376 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన కివీస్ ఆటగాడిగా నిలిచాడు.