కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలకు దమ్మూధైర్యం ఉందా?: నారా లోకేశ్

07-01-2020 Tue 18:46
  • రాజధాని తరలిపోకుండా పోరాడ లేరా?
  • సీఎం జగన్ పై ఒత్తిడి తేలేరా?
  • విడుదల అనంతరం మీడియాతో నారా లోకేశ్

కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలకు దమ్మూధైర్యం ఉంటే రాజధాని అమరావతి నుంచి తరలిపోకుండా చూడాలని, సీఎం జగన్ పై ఒత్తిడి తీసుకురావాలని టీడీపీ నేత నారా లోకేశ్ డిమాండ్ చేశారు. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రుల రాజధాని తరలిపోకుండా పోరాడే ఆమాత్రం దమ్మూధైర్యం వైసీపీ ఎమ్మెల్యేలకు లేదా? అని ప్రశ్నించారు.

ఏ సెక్షన్ కింద మమ్మల్ని అరెస్ట్ చేశారో పోలీసులు చెప్పలేదని, సంతకం చేసేందుకు ఏ ఒక్క కాగితం ఇవ్వలేదని అన్నారు. ‘ఎందుకు తీసుకొచ్చారు?’ అని పోలీసులను ప్రశ్నిస్తే, ‘ఇప్పుడు మీరు వెళ్లొచ్చు సార్’ అని అన్నారే తప్ప సరైన సమాధానం చెప్పలేదని అన్నారు.

‘జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైలు కూడు తిన్నారు. పోలీసు భద్రతతో దర్జాగా అటూఇటూ తిరుగుతున్నాడు. మేము ఏ తప్పు చేయలేదు. మాపై ఒక్క కేసు కూడా లేదు. రైతుల కోసం మేము పోరాడుతుంటే, తీసుకొచ్చి లోపలేశారు! ఎంత వరకు న్యాయమో వాళ్లు కూడా ఆలోచించాలి’ అంటూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.