పిన్నెల్లిపై దాడి చేసింది సీఎం పంపిన మనుషులే: కళా ఆరోపణ

07-01-2020 Tue 18:27
  • జగన్ ఆదేశాలతోనే పిన్నెల్లి వచ్చారన్న కళా
  • దీని వెనుక కుట్ర దాగివుందని వ్యాఖ్యలు
  • టీడీపీ నేతలపై నెపం నెడుతున్నారని మండిపాటు

ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై చినకాకాని వద్ద దాడి జరిగిన నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం ముదిరింది. టీడీపీ గూండాలే దాడికి పాల్పడ్డారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఘాటుగా స్పందించారు.

పిన్నెల్లిపై దాడికి పాల్పడింది సీఎం పంపిన మనుషులేనని ఆరోపించారు. సీఎం పంపితే వచ్చిన వ్యక్తులే హైవేపై రగడ సృష్టించారని అన్నారు. పక్కా ప్రణాళికతో దాడి చేసి ఇప్పుడా నెపాన్ని టీడీపీ నేతలపై నెడుతున్నారని మండిపడ్డారు. పిన్నెల్లి రోడ్డుపైకి వచ్చింది కూడా ముఖ్యమంత్రి ఆదేశాలతోనే అని ఆరోపించారు. దీని వెనుక కుట్ర దాగి ఉందని అన్నారు. ఎమ్మెల్యే ఆనం, మంత్రి సురేశ్ లను అడ్డుకోని రాజధాని రైతులు కేవలం పిన్నెల్లినే ఎందుకు అడ్డుకుంటారని కళా వెంకట్రావు ప్రశ్నించారు.