జగన్ తలకిందులుగా తపస్సు చేసినా రాజధాని మార్చలేరు : సోమిరెడ్డి

07-01-2020 Tue 16:22
  • వైసీపీ ప్రభుత్వమే రాజధాని సమస్యకు కారణం
  • సీఎం జగన్ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెడుతున్నారు
  • బోస్టన్ కమిటీ కేవలం ఐదు రోజుల్లోనే నివేదిక ఇవ్వడమేంటి?

ఏపీ రాజధానిగా అమరావతి అభివృద్ధి పథంలో సాగుతున్న క్రమంలో, అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసి ప్రజల్లో ఆందోళనలు రేపిందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ సర్కారుపై విమర్శలు చేశారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెడుతున్నారని మండిపడ్డారు.

మూడు రాజధానులపై బోస్టన్ కమిటీ కేవలం ఐదు రోజుల్లోనే నివేదిక ఇవ్వడమేంటంటూ.. ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తును కమిటీ ఐదు రోజుల్లోనే తేల్చేస్తుందా? అంటూ ప్రశ్నించారు. జగన్ తలకిందులుగా తపస్సు చేసినా.. రాజధానిని మార్చలేరు అని ఆయన పేర్కొన్నారు. ప్రధాని రాజధానికోసం శంకుస్థాపన చేసి నిధులు కూడా ఇచ్చాక రాజధాని మార్చుతామనడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. వైసీపీ తీరును కేంద్రం చూస్తూ ఊరుకుంటుందని తాను అనుకోవడం లేదని చెప్పారు. జగన్ కు సలహాలు ఇచ్చేందుకు సరైన మంత్రులు లేరా? అని ప్రశ్నించారు.