America: అమెరికా సైనిక బలగాలన్నీ ఉగ్ర మూకలే: ఇరాన్ పార్లమెంట్ తీర్మానం

  • ట్రంప్ వైఖరిపై ఇరాన్ మండిపాటు
  • సులేమానీ హత్యతో ప్రతీకారేచ్ఛలో ఇరాన్
  • పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధమేఘాలు

ఇరాన్ అత్యున్నత సైనిక కమాండర్ ఖాసిం సులేమానీ హత్యతో ఇరాన్ ప్రభుత్వంతోపాటు, అక్కడి ప్రజానీకం అమెరికాపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ పార్లమెంట్ అమెరికాకు వ్యతిరేకంగా తీవ్ర నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని సైనిక బలగాలన్నింటినీ ఉగ్ర జాబితాలోకి చేరుస్తూ ఇరాన్ పార్లమెంట్ తీర్మానం చేసి సంచలనం రేపింది. ఈ మేరకు బిల్లును కూడా పాస్ చేసింది. సులేమానీని చంపాలని ఆదేశాలు జారీచేసిన అమెరికా రక్షణ విభాగం పెంటగాన్, దానిలోని సభ్యులందరు, అనుబంధ సంస్థలు, కమాండర్లు, బలగాలను ఈ బిల్లులో ఉగ్రవాదులుగా పేర్కొంది.

ఇరాక్ లోని తమ దౌత్య కార్యాలయం, సైనిక స్థావరంపై ఇరాన్ సైన్యం పెంచి పోషిస్తున్న కతయీబ్ హెజ్బుల్లా తీవ్రవాద సంస్థ దాడులు చేసిందంటూ అమెరికా సులేమానీని చంపివేసిన విషయం తెలిసిందే. సులేమానీ అంతిమ యాత్రలో ఇరాన్ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మరోసారి దాడులకు పాల్పడితే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని ట్రంప్ హెచ్చరించటం... ఇటు ఇరాన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూండటంతో యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ లోని 52 ప్రాంతాలను లక్ష్యం చేశామని ట్రంప్ ప్రకటన చేయడం, పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఈ నేపథ్యంలోనే అమెరికా వైఖరిని ఇరాన్ తీవ్రంగా దుయ్యబట్టింది. అమెరికా బలగాలన్నింటినీ ఇరాన్ పార్లమెంట్ ఉగ్రవాద జాబితాలో చేర్చి ట్రంప్ కు సవాల్ విసిరింది.

More Telugu News