పిన్నెల్లి కారుపై దాడి జరిగిన తీరు చూస్తే గుండెలు అదిరిపోతాయి: రోజా

07-01-2020 Tue 15:28
  • పిన్నెల్లిని చంపేయాలనే ఆలోచనతోనే దాడి చేసినట్టు అర్థమవుతుంది
  • ప్రజలను విడదీసే ప్రయత్నాన్ని చంద్రబాబు చేస్తున్నారు
  • రాజధానిపై జగన్ ఇంతవరకు ప్రకటన చేయలేదు

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఆందోళనకారులు ఈ రోజు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. మంగళగిరిలో మీడియాతో ఆమె మాట్లాడుతూ, ఈరోజు పిన్నెల్లి కారుపై దాడి జరిగిన తీరు చూస్తే గుండెలు అదిరిపోతాయని భయాందోళన వ్యక్తం చేశారు. కారు అద్దాలు పగిలిన తీరును చూస్తే... పిన్నెల్లిని చంపేయాలనే ఆలోచనతోనే దాడి చేసినట్టు అర్థమవుతుందని అన్నారు.

అల్లర్లను, అరాచకాలను సృష్టించడం, దాన్ని రాజకీయపరంగా అనుకూలంగా మలచుకోవడం చంద్రబాబుకు అలవాటేనని రోజా ఆరోపించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలను విడదీసే ప్రయత్నాన్ని చంద్రబాబు చేస్తున్నారని అన్నారు. ఇకపై వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలపై దాడి చేస్తే... ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులకు ప్రాణభయం కలిగించే విధంగా వ్యవహరిస్తే ఊరుకోబోమని చెప్పారు.

రాజధాని తరలింపుపై ఇంతవరకు ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి జగన్ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదని... కానీ, టీడీపీ ఎందుకు రాద్ధాంతం చేస్తోందని రోజా ప్రశ్నించారు. రాజధాని నివేదికలపై అసెంబ్లీలో చర్చ తర్వాతే తుది ప్రకటన ఉంటుందని అన్నారు. గతంలో మీడియాపై కూడా రాజధాని ప్రాంతంలో దాడి జరిగిందని గుర్తు చేశారు.