ముత్తూట్ ఫైనాన్స్ ఎండీపై రాళ్ల దాడి... తీవ్రగాయాలతో ఆసుపత్రిపాలు!

07-01-2020 Tue 14:51
  • కొచ్చిలో కారులో వెళుతున్న ఎండీ జార్జి అలెగ్జాండర్
  • రాళ్లతో విరుచుకుపడిన దుండగులు 
  • ఇటీవల ఉద్యోగులకు, యాజమాన్యానికి మధ్య విభేదాలు

కొచ్చిలో ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జార్జి అలెగ్జాండర్ పై దాడి జరిగింది. ఆయన కారులో వెళుతుండగా మధ్యలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడికి దిగారు. కారుపై పెద్ద రాళ్లు విసరడంతో ఆయనకు బలమైన గాయాలయ్యాయి. కారు ధ్వంసమైంది. మరో కారులో వచ్చిన సిబ్బంది తీవ్రంగా గాయపడ్డ జార్జి అలెగ్జాండర్ ను ఆసుపత్రికి తరలించారు.

ప్రపంచంలోనే అతి పెద్ద గోల్డ్ ఫైనాన్సింగ్ సంస్థగా ముత్తూట్ ఫైనాన్స్ కు గుర్తింపు ఉంది. కొంతకాలంగా సంస్థ ఉద్యోగులకు, యాజమాన్యానికి మధ్య విభేదాలు నడుస్తున్నాయి. జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసనలు, ధర్నాలు చేపడుతుండడంతో కొందరు ఉద్యోగులపై ముత్తూట్ ఫైనాన్స్ వేటు వేసింది. తమ సంస్థ ఉద్యోగులు సీఐటీయూ కార్మిక సంఘంతో సఖ్యతగా ఉండడం కూడా ముత్తూట్ ఫైనాన్స్ మేనేజ్ మెంట్ కు రుచించడంలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంస్థ ఎండీపై దాడి జరగడం అనేక సందేహాలకు తావిస్తోంది.