సచివాలయానికి రానున్న జగన్.. మెడికల్ షాపులను కూడా మూయించిన పోలీసులు

07-01-2020 Tue 11:39
  • స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ కు రానున్న జగన్
  • భారీ భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు
  • రైతుల మహా ధర్నా కార్యక్రమానికి అనుమతి నిరాకరణ

ఏపీ సచివాలయంలో ఈరోజు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి జగన్ హాజరవుతున్నారు. కాసేపట్లో ఆయన సచివాలయానికి రానున్నారు. వ్యవసాయం, అనుబంధ శాఖలకు రుణాల మంజూరుపై బ్యాంకు ఉన్నతాధికారులతో కీలక చర్చలు జరపనున్నారు.

ఈ నేపథ్యంలో, పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మందడంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. రైతుల మహా ధర్నా కార్యక్రమానికి కూడా అనుమతి ఇవ్వలేదు. జాతీయ రహదారి దిగ్బంధనానికి బయల్దేరిన రైతులు, రైతు కూలీలను కూడా అడ్డుకున్నారు. అంతేకాదు మెడికల్ షాపులను కూడా బంద్ చేయించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ వీరారెడ్డి మాట్లాడుతూ, సచివాలయం, హైకోర్టుకు వెళ్లే దారులను క్లియర్ చేస్తున్నామని చెప్పారు. దుకాణాలను మూయించడం తాత్కాలికమేనని అన్నారు. తాము ప్రజాసేవకే ఉన్నామని... చట్టాలను ఉల్లంఘించేవారిని మాత్రమే అడ్డుకుంటున్నామని చెప్పారు. వీఐపీ బందోబస్తులో భాగంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయని... ప్రజలు సహకరించాలని కోరారు. అత్యవసర సేవలకు ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పారు.