Andhra Pradesh: జాతీయ రహదారి దిగ్బంధానికి సిద్ధమైన రైతులు.. టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పోలీసులు

  • నక్కా ఆనందబాబు, బోడె ప్రసాద్ తదితరుల గృహ నిర్బంధం
  • కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలువురు నేతలు, కార్యకర్తలు అరెస్ట్
  • దిగ్బంధానికి వెళ్లకుండా ఎక్కడికక్కడ చెక్‌పోస్టుల ఏర్పాటు

రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ రెండు వారాలుగా ఆందోళన చేస్తున్న రైతులు నేడు జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీడీపీ మద్దతు ప్రకటించింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు నేతలు సిద్ధమయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలువురు టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. వసంతరాయపురంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబును గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌‌తోపాటు విజయవాడ, పెనమలూరు నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలు, కార్యకర్తలను కూడా గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు.

మంగళగిరిలో టీడీపీ నేత గంజి చిరంజీవి, తాడేపల్లి రూరల్ అధ్యక్షుడు కొమ్మారెడ్డి నాని, పట్టణ అధ్యక్షుడు జంగాల సాంబశివరావు, తాడేపల్లి పట్టణ, రూరల్ టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే,  చినకాకాని వద్ద జాతీయ రహదారి దిగ్బంధానికి వెళ్లకుండా చింతకాని, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం డాన్‌బాస్కో స్కూలు వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.

More Telugu News