Amaravati: అమరావతినే కొనసాగించండి: రాష్ట్రపతికి ప్రవాసాంధ్రుల లేఖ

  • అన్ని సౌకర్యాలకు అనుగుణంగా ఉంటుందనే అమరావతిని ఎంపిక చేశారు
  • అన్ని పార్టీలూ అప్పట్లో అమరావతిని స్వాగతించాయి
  • మీరు జోక్యం చేసుకుంటే తప్ప సమస్య పరిష్కారం కాదు

ఏపీ రాజధాని తరలింపుపై అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్న ప్రవాసాంధ్రులు స్పందించారు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు న్యాయం జరిగేలా చూడాలని లేఖలో పేర్కొన్నారు.

2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అన్ని సౌకర్యాలకు అనుగుణంగా ఉంటుందనే అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినట్టు లేఖలో పేర్కొన్నారు. అమరావతికి అసెంబ్లీతోపాటు అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయన్నారు. అమరావతి నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు.

తమ ప్రాంత అభివృద్ధిని కాంక్షించి 29 గ్రామాల రైతులు 33 వేల ఎకరాలను స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. రాజధాని తరలిపోతే భూములిచ్చిన తమ గతేంకానంటూ రైతులు రెండు వారాలుగా ఆందోళన చేస్తున్నారని, కాబట్టి ఈ విషయంలో జోక్యం చేసుకుని రాజధాని తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

More Telugu News