BCCI: నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ లు వద్దు: విరాట్ కోహ్లీ

  • ఐదు రోజుల ఫార్మాటే బెస్ట్
  • స్వాగతించిన అస్ట్రేలియా క్రికెట్ బోర్డు
  • ఇప్పుడే వ్యాఖ్యానించనన్న బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ

ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ ల ఫార్మాట్ ను కుదించాలన్న ఐసీసీ ప్రతిపాదనను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యతిరేకించాడు.  ప్రస్తుతం అమల్లో ఉన్న ఐదు రోజులు జరిగే టెస్ట్ మ్యాచ్ లను మార్చాల్సిన అవసరంలేదన్నాడు. ప్రస్తుతం అమలులో ఉన్న ఐదు రోజుల ఆట స్థానంలో నాలుగురోజుల పాటు ఆడే టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్ ను ప్రతిపాదిస్తూ.. ఐసీసీ దాన్ని 2023 నుంచి అమలు చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా దీనిపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

రేపు శ్రీలంకతో భారత్ తొలి టీ 20 మ్యాచ్ గువాహటిలో జరుగనున్న నేపథ్యంలో.. కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ... ‘ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ ల పద్ధతిని మార్చాల్సిన అవసరంలేదు. టెస్ట్ క్రికెట్ ను ‘డే అండ్ నైట్’ పద్ధతిలో ఆడించడమంటే దాన్ని వ్యాపారాత్మకంగా చేసినట్లే. దీన్ని మరీ ఇంతగా మార్పులు చేసి ఉద్విగ్నతను రేపటం మంచిదికాదు. డే అండ్ నైట్ పద్ధతే టెస్ట్ క్రికెట్ తీరు తెన్నులను సమూలంగా మారుస్తుందని నేను అనుకుంటున్నాను’ అని కోహ్లీ వ్యాఖ్యానించాడు

4 రోజుల క్రికెట్ పై మిశ్రమ స్పందన

క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డులు  4 రోజుల క్రికెట్ ఫార్మాట్ ను స్వాగతిస్తున్నట్లు ప్రకటించాయి. కాగా, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. ఐసీసీ ప్రతిపాదనపై ఇప్పుడప్పుడే స్పందించడం తొందరపాటు చర్య అవుతుందని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ మాట్లాడుతూ. ఐదు రోజులు సాగితేనే టెస్ట్ మ్యాచ్ లు రసవత్తరంగా ఉంటాయన్నాడు. నాలుగు రోజుల ఆట ప్రతిపాదన హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించాడు.

More Telugu News