సందేశాత్మక సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయి: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్

04-01-2020 Sat 14:53
  • బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబడుతున్న ‘గుడ్ న్యూస్‘ సినిమా
  • అంతర్జాతీయంగా తొలివారంలోనే రూ.45.58 కోట్ల వసూళ్లు
  • ప్రేక్షకాదరణ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అక్షయ్ ట్వీట్

సమాజానికి సందేశాన్ని అందించే సినిమాలు తప్పకుండా విజయవంతమవుతాయని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అన్నారు. తాను నటించిన ‘గుడ్ న్యూస్’ చిత్రానికి వస్తోన్న ఆదరణ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. దీనిపై అక్షయ్ కుమార్ తన సంతోషాన్ని సామాజిక మాధ్యమం ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

‘ఈ చిత్రానికి వస్తోన్న ప్రేక్షకాదరణ పట్ల మేమంతా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఓ మంచి విషయాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ సినిమాను తీశాం. దేశంలోనే కాక విదేశాల్లో కూడా ప్రేక్షకులు మా కథను మంచి మనసుతో స్వీకరించి మాకు మంచి విజయాన్ని అందించారు. దీంతో మంచి సందేశంతో తీసిన సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయనే నమ్మకం నాకు ఏర్పడింది’ అని అక్షయ్ తన సందేశంలో పేర్కొన్నారు.

రాజ్ మెహ్ తా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీలక పాత్రల్లో అక్షయ్ కుమార్ సహా కరీనా కపూర్, కైరా అద్వానీ, దిల్జిత్ నటించారు. గత డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా అంతర్జాతీయ మార్కెట్లో తొలివారంలోనే రూ.45.58 కోట్ల వసూళ్లు రాబట్టింది.