Chandrababu: అది ఓ రిపోర్టా.. చెత్త కాగితం.. వీళ్లకి కనీస ఇంగిత జ్ఞానం ఉందా?: నిప్పులు చెరిగిన చంద్రబాబు

  • తప్పుడు పనులు చేయకూడదు
  • డబ్బులు వస్తాయని కన్సల్టెన్సీ సంస్థ ఏది పడితే అది రాసివ్వకూడదు
  • అమరావతిలో రాజధాని కట్టడానికి ఖర్చు ఎక్కువవుతుందని అంటున్నారు.
  • ఈ కమిటీ నివేదిక  ఆధారంగా ముందుకు వెళ్తారా? 

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై బోస్టన్‌ కన్సల్టింగ్ గ్రూప్‌ (బీసీజీ) ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఈ రోజు ఆయన మంగళగిరిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 'వీళ్లకి కనీస ఇంగిత జ్ఞానం ఉందా? తప్పుడు పనులు చేయకూడదు. డబ్బులు వస్తాయని కన్సల్టెన్సీ సంస్థ ఏది పడితే అది రాసివ్వకూడదు. హుద్ హుద్ కి ముందు తర్వాత విశాఖలో నెలకొన్న పరిస్థితులన్నింటినీ గమనించాలి. అమరావతిలో రాజధాని కట్టడానికి ఖర్చు ఎక్కువవుతుందని అంటున్నారు. ఈ కమిటీ నివేదిక  ఆధారంగా ముందుకు వెళ్తారా?' అని ప్రశ్నించారు.

'ఇది రిపోర్టు కాదు.. ఇది చెత్త కాగితం.. అసత్యాల కుట్ర.. వీళ్లకేమైనా తలాతోకా ఉన్నాయా? మూడు ముక్కలాట ఎందుకు ఆడుతున్నారు. బీసీజీకి జగన్ రాసిస్తే అదే విషయాన్ని రాసి ఇచ్చింది. శివరామకృష్ణ కమిటీ నివేదిక ఆధారంగా రాజధాని అభివృద్ధి ఎలా చేయాలో వేసిందే నారాయణ కమిటీ. ఆ కమిటీపై ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు' అని చంద్రబాబు అన్నారు.

'17 లక్షల జనాభాతో విశాఖ ఉంది. అదే అమరావతిలో అన్ని గ్రామాలు, నగరాలు కలుపుకుంటే 22 లక్షల జనాభా ఉంది. సౌతాఫ్రికా, జర్మనీల్లో మూడు రాజధానులు ఉన్నాయని మాట్లాడుతున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన ఘటనల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. మూడు రాజధానుల వల్ల నష్టం జరిగిందని సౌతాఫ్రికా నేతలే చెబుతున్నారు.

'రాజధానిని మార్చడం ఇండియాలోనూ జరిగింది. అయితే, ప్రత్యేక పరిస్థితుల్లో కొత్త రాష్ట్రాలు ఏర్పడిన సమయంలో మార్చారు. చండీగఢ్, అహ్మదాబాద్, గాంధీనగర్, నయా రాయపూర్ రాజధానుల చరిత్ర చూడండి. జార్ఖండ్, ఉత్తరాంచల్ వంటి ప్రాంతాలను గమనించాలి' అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

More Telugu News