New Year: జనవరి ఒకటి జననాలలో చైనాను దాటేసిన ఇండియా... 67,385 మంది జననం!

  • ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 లక్షల మంది జననాలు
  • రెండో స్థానంలో నిలిచిన చైనా
  • ఫిజీలో పుట్టిన 2020 తొలి బేబీ
  • వెల్లడించిన యునిసెఫ్

నూతన సంవత్సరం తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది జన్మించారని, ఇందులో అత్యధికులు ఇండియాలోనే పుట్టారని యునిసెఫ్ వెల్లడించింది. మొత్తం 3,92,078 మంది జనవరి 1న జన్మించారని, అందులో 67,385 మంది ఇండియాలో పుట్టారని పేర్కొంది. జననాల విషయంలో అత్యధికంగా జనాభా ఉన్న చైనాను భారత్ అధిగమించిందని, చైనాలో న్యూ ఇయర్ ఫస్ట్ డేన 46,299 మంది పుట్టారని పేర్కొంది.

ఫిజీలో 2020 సంవత్సరపు తొలి బేబీ జన్మించిందని వెల్లడించిన యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రిట్టా ఫోరే, మొత్తం జననాల్లో సగం మంది ఎనిమిది దేశాల్లోనే పుట్టారని వెల్లడించారు. ఇండియా, చైనాలతో పాటు నైజీరియా (26,039), పాకిస్థాన్ (16,787), ఇండోనేషియా (13,020), యూఎస్ఏ (10,452), డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (10,247) ఇథియోపియా (8,493) జననాలను చూశాయని తెలిపారు.

గత సంవత్సరం జన్మించిన చిన్నారుల్లో 25 లక్షల మంది పుట్టిన నెల రోజుల వ్యవధిలోనే మృత్యువాత పడ్డారని, నెలలు నిండకుండానే పుట్టడం, డెలివరీ సమయంలో వచ్చే సమస్యలు, ఇన్ఫెక్షన్లు సోకడం ఇందుకు కారణమని హెన్రిటా ఫోరే తెలియజేశారు. గడచిన మూడు దశాబ్దాల కాలంలో చిన్నారుల మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోందని ఆయన తెలిపారు.

More Telugu News