సీఎం కేసీఆర్ అన్నట్టుగా ‘మన్ను అయిందా?’ లేక ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైందా?: ఏపీ మంత్రి పేర్ని నాని 

01-01-2020 Wed 21:17
  • ఏపీఎస్సార్టీసీ విలీనం జరగదన్నట్టు కేసీఆర్ మాట్లాడారు
  • మూడ్నెల్లకో, ఆర్నెల్లకో ఏదో కథ చెబుతారన్నారు
  • అనుభవం కన్నా సంకల్ప బలం బలమైంది

ఏపీలో ఆర్టీసీ విలీనం గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యల గురించి ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని ప్రస్తావించారు. ఏపీఎస్సార్టీసీ ప్రభుత్వంలో విలీనమైన సందర్భంగా విజయవాడలో ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన కృతజ్ఞత సభలో పేర్ని నాని పాల్గొని మాట్లాడారు.

ఏం మన్నూ కూడా జరగలేదని, మూడు నెలలకో, ఆరు నెలలకో ఏదో కథ చెబుతారే తప్ప.. ఏపీఎస్సార్టీసీని ప్రభుత్వంలో మాత్రం విలీనం చేయరని ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. ‘మన్ను అయిందా? ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయిందా?’ అంటూ కార్మికులను ఉద్దేశించి ప్రశ్నించారు. దీనిని బట్టి అనుభవం కన్నా సంకల్పబలం బలమైందన్న విషయం అర్థమవుతోందని అన్నారు.

ఇదిలా ఉండగా, తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన సమయంలో ఏపీఎస్సార్టీసీ విలీనం గురించి హైదరాబాద్ లో మీడియా కేసీఆర్ ను ఓ ప్రశ్న వేసింది. ‘ఒక ఎక్స్ పర్మెంట్ చేశారు వాళ్లు. అక్కడ ఏం మన్నూ కూడా జరగలేదు. మీకు తెల్వదు. కమిటీ వేశారు. ఇంకా, మూడు నెలలకో, ఆరు నెలలకో ఏదో చెబుతారట కథ’ అని కేసీఆర్ విమర్శించడం గమనార్హం.