ఉత్తమ్ కుమార్ పై మండిపడ్డ అసదుద్దీన్ ఒవైసీ

01-01-2020 Wed 13:54
  • హైదరాబాద్ సీపీపై ఉత్తమ్ కుమార్ రెడ్డి వాడిన భాష సరికాదు
  • ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది
  • దారుస్సలాం ఏఐఎంఐఎంకు ఓ ముఖ్యమైన వేదిక
  • ఈ మైదానంలో గతంలో ఇందిరా గాంధీ కూడా సభ నిర్వహించారు

'తెలంగాణ సీఎం కేసీఆర్ కు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ తొత్తు' అంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంజనీకుమార్‌ అవినీతిపరుడని, రాష్ట్రంలో ఉన్నది కల్వకుంట్ల పోలీస్‌ సర్వీస్‌ అని ఆయన ఆరోపించారు. ఇటీవల కాంగ్రెస్‌ ర్యాలీని పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఆర్‌ఎస్‌ఎస్‌ ర్యాలీ, దారుస్సలాంలో ఎంఐఎం సభకు అనుమతిచ్చారని, తమకెందుకు అనుమతి ఇవ్వబోరని ఉత్తమ్ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. ఉత్తమ్ కుమార్ పై విమర్శలు గుప్పించారు.

'హైదరాబాద్ సీపీపై ఉత్తమ్ కుమార్ రెడ్డి వాడిన భాష సరికాదు.. ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది. దారుస్సలాం ఏఐఎంఐఎంకు ఓ ముఖ్యమైన వేదిక. ఈ భారీ మైదానంలో గతంలో ఇందిరా గాంధీ కూడా బహిరంగ సభ నిర్వహించారు. సీఏఏపై ఆందోళనలు నిర్వహించడానికి ఉత్తమ్ కుమార్ చాలా ఉత్సాహంగా ఉన్నారు.. మేము నిజామాబాద్ లో ఇదే విషయంపై నిర్వహించిన సభలో మాత్రం ఆయన పార్టీ పాల్గొనలేదు.. మా ఆహ్వానాన్ని తిరస్కరించింది' అని అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు.