Pawan Kalyan: రోడ్డుపై ముళ్ల కంచెలు తొలగించి ముందుకెళ్లిన పవన్ కల్యాణ్

  • ఎర్రబాలెం నుంచి మందడం వెళ్తున్న సందర్భంగా అడ్డుకున్న పోలీసులు
  • సీఎం వెళ్లేంత వరకు ఆగమని కోరిన పోలీసులు
  • నడుస్తూనే ముందుకు సాగిన పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతి ప్రాంత పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎర్రబాలెం గ్రామంలో రైతులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం... ఆయన అక్కడి నుంచి మందడం గ్రామానికి బయల్దేరారు. ఈ సందర్భంగా, వెంకటపాలెం చెక్ పోస్ట్ వద్ద పవన్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుకు నిరసనగా రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ తర్వాత పవన్ అక్కడి నుంచి ముందుకు సాగారు.

అనంతరం మందడం వద్ద పవన్ ను మరోసారి పోలీసులు అడ్డుకున్నారు. మందడం మీదుగా సీఎం జగన్ వెళ్లాల్సి ఉండటంతో ఆయనను ఆపేశారు. రోడ్డుపై బ్యారికేడ్లు, ఇనుప ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. సీఎం వెళ్లేంత వరకు కాసేపు ఆగాలని పోలీసులు కోరారు. అయితే, సమయం గడుస్తున్నా జగన్ రాకపోవడంతో... రహదారిపై ఉన్న ముళ్ల కంచెలను తొలగించుకుని ఆయన అక్కడి నుంచి ముందుకు కదిలారు. ఒక 500 మీటర్ల దూరం నడుస్తూనే ముందుకు వెళ్లారు. ఆ తర్వాత పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు.

దీంతో రోడ్డు మీద నుంచి కిందకు దిగి ముళ్ల చెట్ల మధ్య నడుస్తూ ఆయన ముందుకు సాగారు. వారిని నిలువరించేందుకు పోలీసులు విశ్వయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. పోలీసుల ఆంక్షల మధ్యే పవన్ మందడం చేరుకోవడం గమనార్హం.

More Telugu News